బన్నీ- త్రివిక్రమ్ మళ్లీ మొదలు పెట్టారు.. ఇక ఆగేదే లేదట
ఈ మధ్య కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోరు కాస్త తగ్గింది. టాలీవుడ్ లోని మిగతా స్టార్ హీరోలంతా మంచి జోష్‌లో ఉండగా బన్నీ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. గతేడాది భారీ అంచనాల నడుమ 'నా పేరు సూర్య' సినిమా రావడం, అది కాస్తా బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీంతో గత పరాజయాన్ని ఫ్యాన్స్ మదిలోంచి తుడిచేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న బన్నీ.. తన కొత్త సినిమా పట్ల చాలా శ్రద్ద తీసుకుంటున్నారట. ఈ మేరకు మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సెట్స్ పై వాలిపోయాడు బన్నీ.
బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచేలా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట త్రివిక్రమ్. ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే గత నేల ఎండల కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చిన చిత్రయూనిట్ తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టేసింది. ఈ రోజు హైదరాబాద్‌లో ఈ షూటింగ్ ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాయి.

బన్నీ, త్రివిక్రమ్ ఎంతో కేర్ తీసుకొని చేస్తున్న ఈ సినిమాను ఇక ఆగేదే లేదన్నట్లుగా త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నేటి నుంచే సెట్స్ పై పూజా హెగ్డే కూడా ఆడిపాడనుంది.
దువ్వాడ జగన్నాధం తర్వాత బన్నీ - పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వినోదాత్మకమైన కుటుంబ నేపథ్య చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఏడాది బన్నీ మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











