Nithiin: అడవిలో హీరో నితిన్‌కు ప్రమాదం.. అతడి పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్పారంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. వెంకీ కుడుముల తెరకెక్కించిన 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఈ టాలెంటెడ్ హీరో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, సక్సెస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇటీవలే నితిన్ 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీమ్యాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ చిత్రం కూడా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక, ఇప్పుడు నితిన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' అనే సినిమాను చేస్తున్నాడు. పవన్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి.

వేణు శ్రీరామ్ - నితిన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'తమ్ముడు' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీనికి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారు. ఇందులో హీరో నితిన్‌తో పాటు చాలా మంది ప్రముఖులు భాగం అవుతున్నారు. త్వరలోనే దీన్ని పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటున్నారు.
'తమ్ముడు' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ హీరో నితిన్‌పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఓ భారీ యాక్షన్ సీన్ చేస్తోన్న సమయంలోనే నితిన్ గాయపడినట్లు తాజాగా తెలిసింది.

గాయపడిన నితిన్‌ను ముందుగా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. అక్కడ ప్రథమ చికిత్సను చేసిన తర్వాత హైదరాబాద్ తరలించారని అంటున్నారు. ఈ ఘటనలో హీరో నితిన్‌కు చాలా చోట్లా గాయాలు అయినట్లు సమాచారం. దీంతో వైద్యులు అతడికి మూడు వారాలు విశ్రాంతి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నితిన్ సన్నిహితులు చెప్తున్నారు.
ఇదిలా ఉండగా.. నితిన్ - వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న 'తమ్ముడు' మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో సప్తమీ గౌడ హీరోయిన్‌గా, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక, నితిన్‌కు గాయాలు కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడిపోయింది.


Click it and Unblock the Notifications











