18 ఏళ్ల నునుగు మీసాల ఇంద్ర.. బాక్సాఫీస్ షేక్.. పీక కోసేస్తా.. పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం రిలీజ్ అయి సరిగ్గా జూలై 24వ తేదీకి 18 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. 2002లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సగటు ప్రేక్షకుడినే కాకుండా సినీ విమర్శకులను కూడా ఈ ఫ్యాక్షన్ చిత్రం మెప్పించింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అప్పట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేసిన ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు..

అప్పుడే 60 కోట్లకు చేరువగా
ఎన్నో సంచలన విజయాలను, ఫ్యాక్షన్ చిత్రాలను జనరంజకంగా మలచిన దర్శకుడు బీ గోపాల్ డైరెక్షన్‌లో ఇంద్ర సినిమా రూపొందింది. ఈ చిత్రం రూ.15 కోట్లతో తెరకెక్కింది. ఈ సినిమా ఓవరాల్‌గా సుమారుగా రూ.60 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2002లో దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన దేవదాస్ తొలిస్ఠానంలో నిలువగా, ఇంద్ర రెండో స్థానంలో నిలిచింది. ఇక 2006 వరకు చంద్రముఖి రిలీజ్ వరకు దక్షిణాదిలో ఈ సినిమా వసూళ్లను అధిగమించిన చిత్రం రాకపోవడం గమనార్హం.

పవర్ ఫుల్ డైలాగ్స్‌తో రచ్చ రచ్చ
ఇంద్ర సినిమా విజయంలో పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్, చిన్నికృష్ణ కథ కీలక పాత్రను పోషించాయి. ‘సింహాసనం మీద కూర్చునే అర్హత.. అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడుది.!', ‘వీర శంకర్‌రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా‘, ‘తప్పు మావైపు ఉంది కనుక తలవంచుకు వెళ్తున్నాను‘, రాననుకొన్నార.. రాలేననుకొన్నారా, కాశికి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకొంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు వరస మార్చుకొంటారని అనుకొంటున్నారా? అదే రక్తం అదే పౌరుషం‘, ‘కాదంటే ఇక్కడ ప్రభుత్వం పాలించదు.. నా కనుసైగ పాలిస్తుంది' అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించాయి.

మ్యూజిక్, పాటలు
ఇంద్ర సినిమాకు పాటలు, సంగీతం మరో హైలెట్. మణిశర్మ సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే సంగీత ప్రియులను ఆకట్టుకొంటాయి. భమ్ భమ్ బోలే పాట గానీ, అమ్మడు అప్పాచీ, రాధే గోవిందా, ఘల్లు ఘల్లు పాటలు మెలోడిగా ప్రేక్షకులకు మత్తెక్కిస్తే.. దాయి దాయి దామ్మ, అయ్యో అయ్యో అయ్యో పాటలు మాస్ ఆడియెన్స్ విజిల్స్ కొట్టించాయి.

ఇంద్ర కలెక్షన్లు ఇలా
ఇంద్ర సినిమా రికార్డుల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి విలువ ప్రకారం అంచనావేస్తే సుమారు రూ.350 కోట్ల వసూళ్ల వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇప్పటి వరకు ఈ రికార్డును మగధీర, బాహుబలి చిత్రాలు మాత్రమే అధిగమించాయి.

ఇంద్ర రికార్డులు
ఇక సినిమా సంచలన విషయాలకు వస్తే.. ఇంద్ర చిత్రం దక్షిణాదిలో 275 సెంటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 156 సెంటర్లలో 50 రోజులు, 125 సెంటర్లలో 100 రోజులు, 33 సెంటర్లలో 175 రోజులు, ఆదోని సత్యం థియేటర్‌లో 200 రోజులు ఆడింది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ (175 రోజల) ఫంక్షన్‌ను విజయవాడలో అట్టహాసంగా జరిపించారు.

విజయవాడలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్
విజయవాడలో జరిగిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఉదయ్ కిరణ్ వేదిక మీద కనిపించారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ రావాల్సి ఉండేది అంటూ పవర్ స్టార్ పేరు చెప్పగానే.. దాదాపు 10 నిమిషాలపాటు ప్రాంగణమంతా దద్దరలింది. ఆ రెస్పాన్స్ చూసి చిరంజీవి సంతోషంలో తబ్బిబుబ్బయ్యారు.
Recommended Video

తెర ముందు తెర వెనుక
నటీనటులు: చిరంజీవి, సొనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్, ముఖేష్ రుషి, శివాజీ తదితరులు
నిర్మాత: సీ అశ్వినీదత్
దర్శకత్వం: బీ గోపాల్
రచయిత: చిన్నికృష్ణ, పరుచూరి బ్రదర్స్
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫి: వీఎస్ఆర్ స్వామి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
రిలీజ్: 24 జూలై 2002
బడ్జెట్: 15 కోట్లు
బాక్సాఫీస్: 60 కోట్లు


Click it and Unblock the Notifications











