Women's Day 2025: యోగా టీచర్ టూ వెండితెర మహారాణి .. అనుష్క జీవితంలో ఇవి తెలుసా?
ఇండస్ట్రీకి ప్రతి యేటా ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు చెరగని ముద్ర వేసిన హీరోయిన్లు కొందరే ఉంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు వారి పేరు అలా నిలిచే ఉంటుంది. ఈ కోవలోకే వస్తారు కన్నడ కస్తూరి అనుష్క శెట్టి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ లేడీ సూపర్‌స్టార్ సక్సెస్ స్టోరీ ఒకసారి పరిశీలిస్తే :
7 నవంబర్ 1981న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు అనుష్క శెట్టి. ఆమె అసలు పేరు స్వీటి శెట్టి. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో బీసీఏ చదివిన అనుష్క.. చదువు పూర్తి చేసిన తర్వాత నాటి స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా భర్త భరత్ ఠాకూర్ వద్ద యోగాలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ప్రొఫెషనల్ యోగా టీచర్‌గా పలువురు సెలబ్రెటీలకు శిక్షణ ఇచ్చారు. ఈ దశలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కళ్లలో అనుష్క పడ్డారు. అక్కినేని నాగార్జునతో ఆయన తెరకెక్కించిన సూపర్ సినిమాలో అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే తన పేరు స్వీటి శెట్టిగా ఉంటే బాగుండదని భావించిన అనుష్క.. నేపథ్య గాయనీ అనుష్క మన్‌చందా పేరులోని అనుష్కను తన స్టేజ్ నేమ్‌గా మార్చుకున్నారు.

తొలినాళ్లలో అందాల ఆరబోతకు , గ్లామరస్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన అనుష్క నట జీవితాన్ని అరుంధతి చిత్రం మలుపు తిప్పింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ, అరుంధతిగా ఆమె తన నట విశ్వరూపం చూపారు. ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిన అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సెంటర్‌గా నిలిచారు. పంచాక్షరి, నాగవల్లి, భాగమతి, రుద్రమదేవి చిత్రాలతో లేడీ సూపర్‌స్టార్‌గా అవతరించారు.
ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో దేవసేనగా అనుష్క మరోసారి తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఆమె కెరీర్‌ను సైజ్ జీరో చిత్రం తలక్రిందులు చేసింది. ఈ సినిమాలో పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగారు అనుష్క. ఆమె ఇంత కష్టపడినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. బరువు పెరిగిన అనుష్క .. తిరిగి బరువు తగ్గేందుకు ఎంతో శ్రమించారు . కానీ ఫలితం మాత్రం శూన్యం. దీంతో ఆమెకు సినిమాలలో ఆఫర్లు కూడా తగ్గాయి.

తర్వాత చేసిన నిశ్శబ్ధం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయం. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటిలో అనుష్క నటిస్తున్నారు. దీనితో పాటు మలయాళంలో కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే సినిమాలో దేవసేన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 20 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళ భాషలలో పలు చిత్రాల్లో నటించిన అనుష్క తన మాతృభాష కన్నడంలో మాత్రం నటించలేదు.
కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అనుష్క తన నట జీవితంలో 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు, రెండు సైమా అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. ఫిమేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా , స్టార్స్‌ను మించిన కలెక్షన్స్‌ను రాబట్టి శెభాష్ అనిపించుకున్నారు అనుష్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కెరీర్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











