CCL 2026: సోనుసూద్ జట్టుపై అఖిల్ అక్కినేని టీమ్ ఘన విజయం.. తెలుగు వారియర్స్ భారీ గెలుపు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026 టోర్నీలో భాగంగా వైజాగ్‌లోని ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ దే షేర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు 18.1 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేసింది. దాంతో 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు ఫీల్డింగ్ చేపట్టింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు అశ్విన్ బాబు, అఖిల్ అక్కినేని ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. స్కోరు బోర్డుపై పరుగుల వరద పారించారు. తొలి వికెట్‌కు వారిద్దరూ 132 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత 51 బంతుల్లో 9 ఫోర్లుతో 60 పరుగులు చేసిన అశ్విన్ బాబు జెస్సీ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. దాంతో 132 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.

ఆ తర్వాత వచ్చిన సమ్రాట్, తమన్, వినయ్ వెంటవెంటనే అవుటయ్యారు. దాంతో తెలుగు వారియర్స్ జట్టు నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే అఖిల్ అక్కినేని సుడిగాలి ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో కేవలం 56 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అఖిల్ సెంచరీ సాధించడం ఈ మ్యాచ్‌లో కొసమెరుపు. అఖిల్ బాధ్యతాయుతంగా ఆడటమే కాకుండా కెప్టెన్స్ ఇన్నింగ్స్‌తో సినీ, క్రికెట్ అభిమానులను ఆలరించారు.
తెలుగు వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సామ్రాట్ 4 పరుగులు, థమన్ 1 పరుగు, వినయ్ మహాదేవ్ 6 పరుగులు సాధించారు. పంజాబ్ జట్టులో రౌనక్ సింగ్ 2 వికెట్లు, జెస్పీ 1 వికెట్ పడగొట్టారు. ఓంకార్ సున్నా పరుగులతో క్రీజులో నాటౌట్‌గా నిలిచారు. దాంతో పంజాబ్ జట్టు ముందు 185 పరుగుల విజయలక్ష్యాన్ని తెలుగు వారియర్స్ ఉంచారు.
అనంతరం 185 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ నింజా 10 పరుగులు చేసి సమ్రాట్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ బబ్బల్ రాయ్ 1 పరుగు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ కుదురుగా ఆడినట్టు కనిపించినప్పటికీ.. 15 పరుగుల వద్ద రఘు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సర్వంత్ సింగ్ కూడా 2 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. కరణ్ వాహి ఒంటరిపోరాటం చేశాడు. ఆయనకు హార్డీ సంధూ అండగా నిలిచాడు.
అయితే ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్న హార్డీ అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్బుతమైన త్రో వేయడంతో హార్డీ 28 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అనుజ్‌ను సుదీర్ బాబు క్యాచ్ పట్టగా హీరో నిఖిల్ అవుట్ చేశాడు. అయితే పరుగుల వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించిన కరణ్ వాహి 56 పరుగుల చేసి నిఖిల్ క్యాచ్ పట్టగా సమ్రాట్ బౌలింగ్ అవుటాయ్యాడు. దాంతో పంజాబ్ జట్టు 16.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత మయూర్ మెహతా 13 పరుగులు, దక్ష్ డకౌట్ అయ్యారు. రనౌక్ సింగ్ డకౌట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 132 పరుగుల వద్ద ముగిసింది.
తెలుగు వారియర్స్ జట్టులో వినయ్ మహదేవ్ 3 వికెట్లు, సమ్రాట్ రెడ్డి 2 వికెట్లు, రఘు, నిఖిల్, అశ్విన్ బాబు చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు వారియర్స్ తమ మొదటి మ్యాచ్‌లో పరాజయం చెందగా, రెండో మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











