అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుక... నాలుగు రోజుల సెలబ్రేషన్స్ షెడ్యూల్ ఇదే
అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, కోడలు రాధికల రెండవ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ మే 28 నుండి ఇటలీలో ప్రారంభమైంది. మరి ఈ సెలబ్రేషన్స్ షెడ్యూల్ విశేషాలు ఏంటి అనే విషయమపై ఓ లుక్కేద్దాం పదండి.
అనంత్ అంబానీ మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక రూ.1,259 కోట్లు ఖర్చుతో జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని విధంగా తన కొడుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ముఖేష్ అంబానీ మరో భారీ బడ్జెట్ క్రూయిజ్ పార్టీని ఏర్పాటు చేశారు.

ఇందులో పాల్గొన్న అతిథులు జీవితాంతం మరచిపోలేని విషయంగా పార్టీని ప్లాన్ చేశారు. అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక రూ.7000 కోట్లతో లగ్జరీ క్రూయిజ్‌లో జరుగుతోంది. దీనికి 800 మంది సినీ, రాజకీయ, క్రీడా, జాతీయ, అంతర్జాతీయ అతిథులు హాజరవుతారని సమాచారం. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్న లగ్జరీ క్రూయిజ్ లో పార్టీ జరగనుంది.
రాధిక-అనంత్ ల రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నాలుగు రోజుల పాటు ప్లాన్ చేశారు. మే 28న ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు. రెండవ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం చాలా విభిన్న థీమ్‌లు ప్లాన్ చేశారు. ఈ వేడుకలు శనివారం పూర్తవుతాయి.
ఈ నాలుగు రోజుల షెడ్యూల్ ఏంటంటే.. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మే 29, బుధవారం ఇటలీలోని పలెర్మోలో క్రూయిజ్ షిప్‌లో స్వాగత భోజనంతో ప్రారంభమవుతాయి. ఇందులో పాల్గొనే అతిథులు 'క్లాసిక్ క్రూయిజ్' అనే దుస్తుల కోడ్ ను పాటించాలి. ఈరోజు సాయంత్రం 'స్టార్రీ నైట్' పేరుతో ఒక ఈవెంట్ ఉంటుంది. దీని కోసం అతిథులు పాశ్చాత్య ఫార్మల్స్‌లో దుస్తులు ధరించాలి.
రెండవ రోజు అంటే మే 30 న రోమ్‌లో జరిగే ఈవెంట్‌కు 'ఎ రోమన్ హాలిడే' అని పేరు పెట్టారు. ఇందులో అతిథులు పర్యాటకుల స్టైల్ లో దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు కొంత విశ్రాంతి తీసుకుంటారు. ఓడలో అర్థరాత్రి టోగా పార్టీ షెడ్యూల్ చేశారు.

మే 31న బేబీ వేద మొదటి పుట్టినరోజును క్రూయిజ్ షిప్‌లో జరుపుకోనున్నారు. ఆమె ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు రెండవ సంతానం. తరువాత అతిథులు ఫ్రాన్స్‌కు దక్షిణాన ఉన్న కేన్స్‌లో 'లే మాస్క్వెరేడ్' పేరుతో బ్లాక్-టై ఈవెనింగ్ పార్టీలో పాల్గొంటారు. వేడుకల చివరి రోజున అతిథులను ఇటలీలోని పోర్టోఫినో పట్టణానికి తీసుకువెళతారు. అక్కడ సాయంత్రం వారు 'లా డోల్స్ వీటా' థీమ్ ప్రకారం ఇటాలియన్ వేసవి దుస్తులు ధరిస్తారు.
ఇక ఐరోపాలో జరగనున్న అనంత్ అంబానీ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ క్రూయిజ్ బాష్‌కి రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దంపతులు, బోనీ కపూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, అనన్య పాండే, కరణ్ జోహార్, కరిష్మా కపూర్ బయలుదేరారు. ఇప్పటిదాకా ఈ వేడుకకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే విషయంపై పెద్దగా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అతిథులు ఒక్కొక్కరుగా బయల్దేరుతూ విమానాశ్రయంలో దర్శనం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











