Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఆ కన్నీటి గాథ నాకే తెలుసు.. అనుష్క శర్మ ఎమోషనల్
ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అధ్యాయం ముగియనున్నది. దాదాపు 14 ఏళ్లుగా నిరంతరంగా భారత క్రికెట్ జట్టుకు వెన్నముకగా నిలిచిన ఆయన రిటైర్మెంట్‌ను ప్రకటించాలని నిర్ణయించుకోవడం భారతీయ క్రికెట్ అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్‌ను కదిలించింది. ఎన్నో రికార్డులను, సెంచరీలను తన ఖాతాలో వేసుకొన్న ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ నిష్క్రమణపై ఆయన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఎమోషనల్‌గా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. విరాట్ కోహ్లీ, అనుష్క భావోద్వేగాల వివరాల్లోకి వెళితే..
14 ఏళ్ల క్రితం
టెస్ట్ క్రికెట్ బ్లూ డ్రస్‌ను ధరించి 14 ఏళ్లు కావొస్తుంది. అయితే నా ప్రయాణం ఇంత గొప్పగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నన్ను ఎన్నో సంఘటనలు పరీక్షించాయి. నన్నుగా రూపుదిద్దాయి. ఎన్నో పాఠాలు నేర్పాయి. వాటిని జీవితాంతం నా మనసులో ఉంచుకొంటాను అని విరాట్ కోహ్లీ తన పోస్టులో పేర్కొన్నారు.

జీవితాంతం నా వెంటనే..
తెల్ల దుస్తుల్లో క్రికెట్ ఆడటం నాకు భావోద్వేగమైన అంశం.కొన్ని చిన్న సంఘటనలే కావొచ్చు కానీ జీవితాంతం వెన్నంటి ఉంటాయి. ఇలాంటి ప్రయాణాన్ని ఆపేయాలని నిర్ణయం తీసుకోవడం నాకు తేలికైన విషయం కాదు. కానీ అది సరైన నిర్ణయమే అని భావిస్తాను. నేను నా ఆటకు ఎంతో ఇస్తే.. అంతకంటే ఎక్కువగా నాకు తిరిగి ఇచ్చింది. మైదానంలో నా సహచర క్రీడాకారులు, నాకు క్రికెట్ ఇచ్చిన జీవితానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా టెస్ట్ క్రికెట్‌ను చిరునవ్వుతోనే తిరిగి చూసుకొనేంత గొప్పగా సాగింది అని విరాట్ కోహ్లీ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
ఎవరికి తెలియని కన్నీటి గాథ గురించి
అయితే తన భర్త విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని అనుష్క శర్మ ఎమోషనల్‌గా స్వాగతించింది. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ సాధించిన రికార్డులు, మైలురాళ్లను అందరూ గుర్తుంచుకొంటారు. కానీ నీ కంటి చాటున దాచుకొన్న కన్నీరును, నీవు చేసిన యుద్దం, టెస్ట్ ఫార్మాట్‌పై నీవు చూపిన ప్రేమను నేను ఎప్పుడూ గుర్తుంచుకొంటాను. ప్రతీ టెస్ట్ సిరీస్ తర్వాత ప్రతీసారి నీవు ఎంతో గొప్పగా తిరిగి వచ్చేవాడివి. నీవు ఎదిగిన విధానాన్ని పక్కన ఉండి చూడటం గొప్ప అదృష్టంగా భావిస్తుంటాను అని అనుష్క శర్మ తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వెల్లడించింది.
నీ మనసు చెప్పిన ప్రకారమే..
ఏదో ఒక రోజు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతావని తెలుసు. కానీ నీ మనసు చెప్పిన నిర్ణయం ప్రకారమే నీవు నిర్ణయం తీసుకొన్నావని నాకు తెలుసు. ఈ ఆట నుంచి నీవు నిష్క్రమించడానికి అన్ని రకాల ప్రేమను పొందావని, నేను చెప్పే గుడ్ బైకి అర్హుడివని భావిస్తున్నాను అని అనుష్క శర్మ భావోద్వేగానికి గురైంది.
విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే..2011 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టి తొలిసారి వెస్టిండీస్‌పై ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకొన్న దాఖలాలు లేవు. గత 14 ఏళ్లలో మొత్తంగా 123 టెస్టులు ఆడాడు. అందులో 68 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు 9230 పరుగులు సాధించాడు.


Click it and Unblock the Notifications











