నటుడిగానే చూశాడు.. నాలో సామాజిక స్పృహను గుర్తించలేదు.. అల్లు అరవింద్‌పై పవన్ వ్యాఖ్యల వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన వైసీపీ కేవలం 10 స్థానాలకే పరిమితం కావడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. చంద్రబాబు నాయుడు ఈ నెల 9న అమరావతిలో నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఆవిర్భవించడం విశేషం. గడిచిన పదేళ్లుగా ఎన్నో విమర్శలను ఎదుర్కొని, అధికారం, పదవి లేకుండా ఉన్న పార్టీని పవన్ కళ్యాణ్ తన కష్టంతో ఈ స్థాయికి తీసుకొచ్చారు. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన పార్టీ గెలవడం విశేషం. అంతేకాదు.. జనసేనకు ఇకపై 'గాజు గ్లాస్ ' గుర్తు పర్మినెంట్ సింబల్‌గా మారనుంది.
ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీని మెగా, పవన్ అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 2008 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకారు. తనను ఇంతటివాడిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలారు. రాజకీయా దిగ్గజాలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడటం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కేవలం 18 స్థానాల్లోనే విజయం సాధించిన చిరు.. తర్వాత పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర కేబినెట్‌లో బెర్త్‌లతో పాటు తను రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

పీఆర్పీ విఫల ప్రయోగం జరిగిన దాదాపు ఐదేళ్లకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. అయితే నాటి పరిస్ధితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు కావాలనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్ధతు పలికారు. 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే పవన్ కళ్యాణ్ తను పోటీచేసిన భీమవరం, గాజువాకలలో ఓటమి పాలు కావడంతో ఇక జనసేన పని అయిపోయిందని అది మరో ప్రజారాజ్యమేనంటూ వైసీపీ నేతలు హేళన చేశారు. జనసేనను టీడీపీలోనో, బీజేపీలోనో విలీనం చేసి పవన్ ఏదో ఒక పదవితో సరిపెట్టుకుంటారంటూ ఆరోపణలు చేశారు.
కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్ మనోస్థైర్యం కోల్పోకుండా, అవమానాలను దిగమించి ముందుకు కదిలారు. ఓటమికి కృంగిపోకుండా జనసైనికులను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా చేయడంతో పాటు తాను వారాహీ యాత్రతో సుడిగాలి పర్యటనలు చేశారు. కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు , తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి కూటమి కట్టాల్సిందేనన్న భావనను రగిలించారు. బీజేపీని కూటమిలోకి తెచ్చేందుకు త్యాగానికి సైతం సిద్ధపడి నేడు అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ దశాబ్ధకాలం పాటు పవన్ చూపిన పోరాట పటిమను కొనసాగిస్తే జనసేనాని రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదుగుతారని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన మాటలను జనసేన అభిమానులు షేర్ చేస్తున్నారు.
ప్రజారాజ్యం విఫలం కావడం కాపుల మనోభావాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజిత ఏపీలోనూ తమ సామాజికవర్గం నుంచి ఎవరూ సీఎం కారా అన్న ప్రశ్న వారిని తొలిచేసింది. మిగిలినవారి సంగతేమో కానీ పవన్ సైతం పీఆర్పీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు కూడా. కొందరి వల్లే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చిందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి బావమరిది , నిర్మాత అల్లు అరవింద్‌పైనా అనేక ఆరోపణలు వచ్చాయి. తనను అల్లు అరవింద్ ఓ నటుడిగానే చూశారని, అంతే తప్పించి ఓ సామాజిక సృహ ఉన్న వ్యక్తిగా గుర్తించలేదని పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు తానేం మాట్లాడినా ఎవరు పట్టించుకుంటారని అక్కసు వెళ్లగక్కారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











