CCL 2025: కప్‌పై కన్నేసిన బెంగాల్.. బరిలో ధీటుగా కర్ణాటక.. హోరాహోరీగా సెమీస్ ఎక్కడ? ఎప్పుడంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2025 టోర్నమెంట్ తుది దశకు చేరుకొన్నది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో అటు బౌలింగ్, బ్యాటింగ్‌తో సత్తా చాటని బెంగాల్ టైగర్స్ జట్టు, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, చెన్నై రైనోస్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా ఈ ఏడాది టైటిల్‌పై కన్నేశాయి. దాంతో ఈ సారి కప్పు ఎవరి వశం అవుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఓటమి ఎరుగని జట్టుగా బెంగాల్ టైగర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 4 మ్యాచుల్లోనే బెంగాల్ జట్టు విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఆడిన 4 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ ఓడి పాయింట్ల టేబుల్‌లో రెండోస్థానంలో కర్ణాటక బుల్డోజర్స్ నిలిచింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో చెన్నై రైనోస్, పంజాబ్ ది షేర్ జట్లు నిలిచాయి.

సీసీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు మైసూర్ వేదికగా నిలిచింది. తొలి మ్యాచ్ సెమీ ఫైనల్ మ్యాచ్ బెంగాల్ టైగర్స్ జట్టు, పంజాబ్ ది షేర్ జట్ల మధ్య జరుగనున్నది. బెంగాల్ జట్టుకు జిషుసేన్ గుప్తా, పంజాబ్ జట్టుకు సోనుసూద్ నాయకత్వం వహిస్తున్నారు. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన బెంగాల్ మరోసారి ఫైనల్‌కు చేరి టైటిల్ గెలుచుకోవాలని ఉవ్విల్లూరుతున్నది.
ఇక రెండో సెమిఫైనల్ మ్యాచ్‌లో గతేడాది రన్నరప్‌గా నిలిచిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో చెన్నై రైనోస్ జట్టు పోటీ పడుతున్నది. గతేడాది కొద్ది తేడాతో కప్ చేజార్చుకొన్న కన్నడ జట్టు ఈ సారి ఫైనల్‌కు చేరి కప్‌ను సొంతం చేసుకోవాలనే ప్లాన్‌లో ఉంది. డార్లింగ్ కృష్ణ లాంటి డాషింగ్ బ్యాట్స్‌మెన్ అండతో టీమ్ బలంగా కనిపిస్తున్నది.
మైసూర్‌లో బెంగాల్, పంజాబ్ ది షేర్ జట్ల మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగుతుంది. నిర్ణీత 20 ఓవర్ల మ్యాచ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల లెక్కన ఈ టోర్నీ జరుగుతుంది. ఇక కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో చెన్నై రైనోస్ జట్టు తలపడనున్నది. మార్చి 1వ తేదీన ఈ మ్యాచ్ 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది. సినీ, క్రికేట్ అభిమానులు ఈ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులు హోరాహోరీగా రసవత్తరంగా సాగుతాయనే ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











