CCL 2025: నరాలు తెగె ఉత్కంఠ.. సుదీప్ కిచ్చ సేన చిత్తు చిత్తు.. పంజాబ్ షేర్స్ ఘన విజయం
సూరత్: సీసీఎల్ మ్యాచ్‌లో ఛాంపియన్స్ కర్ణాటక బుల్డోజర్ జట్టు, పంజాబ్ ది షేర్స్ జట్ల నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు నువ్వా? నేనా? అనే విధంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. పటిష్టమైన స్థితిలో ఉన్న కన్నడ జట్టు గెలుపును పంజాబ్ బౌలర్లు లాగేసుకొన్నారు. దాంతో గెలుపు పంజాబ్ జట్టు పక్షాన నిలిచింది. దాంతో కన్నడ టీమ్ చిత్తు చిత్తుగా ఓడింది. ఈ సీజన్‌లో సుదీప్ జట్టుకు తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL 2025)లో భాగంగా కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో సూరత్‌లోని స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ది షేర్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో కర్ణాటక జట్టు ఫీల్డింగ్‌కు దిగింది. దాంతో సెమీస్ ఆశలతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆటగాళ్లు ధాటిగా బ్యాట్ ఝులిపించి పరుగుల వరద పారించారు. దాంతో పంజాబ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు ఇన్నింగ్స్‌ను బబ్బల్, కరణ్ ఆరంభించారు. ఓపెనర్ బబ్బల్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఫోర్లు, సిక్సర్లతో కేవలం 20 బంతుల్లోనే 38 పరుగులు చేసి చందన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆతర్వాత రాహుల్ 7 బంతుల్లో 18 పరుగులు, 12 బంతుల్లో 17 పరుగులు చేయడంతో జట్టు పటిష్టంగా భారీ స్కోర్ చేస్తుందనే నమ్మకం కలిగింది. అయితే ఆ ఇద్దరు అవుట్ అయిన తర్వాత పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఆ తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా డబుల్ డిజిట్ స్కోర్లు చేయకపోవడం గమనార్హం.

పంజాబ్ జట్టు వికెట్లను కర్ణాటక జట్టు పేక మేడలా కూల్చడంతో భారీ స్కోర్‌కు బ్రేక్ పడింది. అయినప్పటికీ చివరి ఓవర్‌లో 4 ఫోర్లు, 2 పరుగులు రావడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. పంజాబ్ ఆటగాడు అనూజ్ కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కర్నాటక జట్టులో గణేష్, చందన్, కరణ్ రెండేసి వికెట్లు, కార్తీక్, సునీల్ చెరో వికెట్ పడగొట్టారు.
122 పరుగుల టార్గెట్‌తో తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కర్ణాటక జట్టు తొలి ఓవర్‌లో తడబాటుకు గురైనప్పటికీ.. ఆ తర్వాత కుదురుకొని ధాటిగా బ్యాటింగ్ చేసింది. రాజీవ్, చందన్ ఇద్దరు కలిసి బోర్డుపై స్కోరును పరుగులు పెట్టించారు. 26 బంతుల్లో 40 పరుగులు చేసిన తర్వాత రాజీవ్ అవుటయ్యాడు. ఆ తర్వాత కార్తీక్, డార్లింగ్ కృష్ణ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను చేపట్టారు. డార్లింగ్ కృష్ణ 11 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యారు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేశారు. చందన్ 13 పరుగులు చేయగా.. కార్తీక్ 13 పరుగులు, కరణ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.దాంతో కర్ణాటకపై పంజాబ్‌కు 30 పరుగుల ఆధిక్యం లభించింది.
30 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టును కర్ణాటక బౌలర్లు దెబ్బ తీశారు. 25 పరుగులకే 4 వికెట్లు తీసి పంజాబ్‌ను డిఫెన్స్‌లో కర్ణాటక పడేసింది. అయితే చివరి ఓవర్లలో ధాటిగా ఆడటంతో 10 ఓవర్లలో 90 పరుగులు చేసింది. దాంతో వారికి 125 పరుగుల అధిక్యం లభించింది. కర్ణాటక బుల్డోజర్స్ ముందు 125 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచి భారీ సవాల్‌ను విసిరింది.
అయితే 125 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక బుల్జోజర్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను సిక్సర్లు, ఫోర్లతో జోరుగా ప్రారంభించారు. కర్ణాటక జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డార్లింగ్ కృష్ణ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఓ దశలో 15 ఓవర్లలోనే 31 పరుగులు చేశాడు. కృష్ణ మెరుపు ఇన్నింగ్స్‌తో 3 ఓవర్లలోనే 39 పరుగులు చేసింది. అయితే 52 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించిన మంజునాథ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆయన 7 బంతుల్లో 15 పరుగులు చేశాడు. దాంతో 52 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.
ఆ తర్వాత కెప్టెన్ సుదీప్ కిచ్చ బ్యాటింగ్‌కు దిగాడు. అయితే తొలి బంతికే రన్ తీయడానికి ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దాంతో 52 పరుగుల వద్ద 2వ వికెట్ పడింది. సుదీప్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాజీవ్ జోరుగా బ్యాటింగ్ చేశాడు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోరును పరుగు పెట్టించాడు. 88 పరుగుల వద్ద రాజీవ్ సిక్సర్ కోసం ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్‌కు దొరికిపోయాడు. రాజీవ్ 24 పరుగులు చేసి అవుటయ్యాడు. రాజీవ్ స్థానంలో కరణ్ బ్యాటింగ్‌కు దిగాడు. 94 పరుగుల వద్ద డార్లింగ్ కృష్ణ రూపంలో 4వ వికెట్‌ను పంజాబ్ జట్టుకు సమర్పించుకొన్నది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 26 బంతుల్లో 42 పరుగులు చేసి ఆయన అవుట్ అయ్యాడు. 99 పరుగుల వద్ద 5 వికెట్‌ను కర్ణాటక కోల్పోయింది.
కర్ణాటక విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు అవసరం అయింది. అయితే ఈ ఓవర్‌లో కర్ణాటక ఆటగాళ్లు మూడు ఫోర్లతో 18 పరుగులు చేశారు. దాంతో చివరి ఓవర్‌లో అనగా 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే రెండు బంతుల్లో 2 పరుగులు చేశారు. ఇక 4 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది. అంతా బుల్డోజర్స్ గెలుపు సులభమే అనుకొన్నారు. కానీ జస్పీ గిల్ బంతితో చేసిన మ్యాజిక్‌తో కర్ణాటక విజయం ముగింట బోల్తా పడింది. కన్నడ బ్యాట్స్‌మెన్లు 4 బంతికి క్లీన్ బౌల్డ్, 3 బంతికి రనౌట్, 2 బంతికి క్లీన్ బౌల్డ్ కావడంతో ఇక చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి రాగా.. వాళ్లు 2 పరుగులు మాత్రమే చేశారు. దాంతో పంజాబ్ జట్టు 2 పరుగుల తేడాతో నరాలు తెగె ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లో విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











