CCL 2026: జ్యామీ వన్ మ్యాన్ షో.. ఉత్కంఠపోరులో ముంబాయిపై బెంగాల్ టైగర్స్ ఘన విజయం..
CCL 2026: సినిమా గ్లామర్, క్రికెట్ మజా కలగలిసిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) 2026 సందడి మొదలైంది. ఈ లీగ్ లో భాగంగా విశాఖ పట్నం వేదికగా ఉత్కంఠ పోరు జరిగింది. ఈ లీగ్ లోని మూడో మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊహించని ఉత్కంఠను, వినోదాన్ని అందించింది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని ముంబాయి హీరోస్ (Mumbai Heroes) డిఫెండింగ్ చాంపియన్స్ బెంగాల్ టైగర్స్ (Bengal Tigers) మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగి, చివరకు బెంగాల్ టైగర్స్ సంచలన విజయం సాధించింది.
ముంబయి హీరోస్ ఇన్నింగ్స్
ముందుగా టాస్ గెలిచిన ముంబయి హీరోస్..బ్యాటింగ్ ఎంచుకోవడం మ్యాచ్ ఆరంభంలోనే సరైన నిర్ణయంగా కనిపించింది. ఓపెనర్లుగా వచ్చిన సాకిబ్ సలీం, షబ్బీర్ అలువాలియా జట్టుకు అదిరిపోయే శుభఆరంభం అందించారు. ముఖ్యంగా షబ్బీర్ అలువాలియా తొలి ఓవర్ల నుంచే బెంగాల్ బౌలర్లపై దాడి చేస్తూ మ్యాచ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిచారు. కేవలం 23 బంతుల్లో అర్ధశతకం సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో షబ్బీర్ మొత్తం 57 పరుగులు చేసి ముంబయి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లేలా చేశాడు.

షబ్బీర్ ఔటైన తర్వాత కూడా ముంబయి జట్టు రన్‌రేట్ తగ్గనివ్వలేదు. నిషాంత్ దహియా మిడిల్ ఓవర్లలో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 31 పరుగులు జోడించాడు. మరోవైపు బెంగాల్ బౌలర్ జాయ్ ముఖర్జీ కీలక దశలో మూడు వికెట్లు తీసి ముంబయి జోరును కొంతవరకు కట్టడి చేశాడు. అయినప్పటికీ చివరి దశలో వచ్చిన నవదీప్ తోమర్ తన పవర్ హిట్టింగ్‌తో మళ్లీ మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పాడు. అతను చేసిన 43 పరుగులు స్కోర్‌ను గణనీయంగా పెంచాయి. చివరి ఓవర్‌లో కెప్టెన్ రితేష్ దేశ్‌ముఖ్ కూడా కీలక షాట్లతో 18 పరుగులు సాధించాడు. ఫలితంగా 20 ఓవర్లకు ముంబయి హీరోస్ 199/6 భారీ స్కోర్‌ను బోర్డుపై నిలబెట్టింది.
బెంగాల్ టైగర్స్ ఛేజ్ - ఒత్తిడిలో ఆరంభం
200 పరుగుల భారీ లక్ష్యంతో బెంగాల్ టైగర్స్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఓవర్లలో జాయ్, ఇంద్రశిష్ కాస్త జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే మూడో ఓవర్‌లో ఫ్రెడ్డి బౌలింగ్‌లో జాయ్ ఔటవడంతో బెంగాల్‌కు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్‌లో నిషాంత్ దహియా బౌలింగ్‌లో ఇంద్రశిష్ కూడా పెవిలియన్ చేరడంతో స్కోర్ 22/2గా మారింది. దీంతో బెంగాల్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. పవర్‌ప్లే ముగిసే సరికి బెంగాల్ టైగర్స్ ఏకంగా 3 కీలక వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. రన్‌రేట్ పెరిగిపోతుండగా వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ పూర్తిగా ముంబయి వైపు వెళ్లినట్టు కనిపించింది. 2024 చాంపియన్స్ అయిన బెంగాల్ టైగర్స్ ఇంత తొందరగా ఒత్తిడిలో పడటం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
జ్యామీ వన్ మ్యాన్ షో - మ్యాచ్ టర్నింగ్ పాయింట్
ఇలా క్లిష్ట పరిస్థితుల్లో జ్యామీ క్రీజ్‌లో నిలబడి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. మొదట జాగ్రత్తగా ఆడిన అతడు, తర్వాత తన షాట్స్ తో ముంబాయి బౌలర్లపై విరుచుకపడ్డారు. ఎనిమిదో ఓవర్‌కు బెంగాల్ 54/3కు చేరగా, రన్‌రేట్ కూడా క్రమంగా పెరిగింది. పదో ఓవర్‌లో శివాంకిత్ బౌలింగ్‌లో కెప్టెన్ జిష్షు సెంగుప్తా ఔటైనప్పటికీ జ్యామీ మాత్రం జట్టుకు అండగా నిలబడ్డాడు. 12 ఓవర్లకు స్కోర్ 95/5 గా ఉన్న దశలో కూడా బెంగాల్ విజయం దూరంగానే కనిపించింది. కానీ, జ్యామీ అర్ధశతకం పూర్తి చేసి మ్యాచ్‌పై తన పట్టు సాధించాడు. ఇక 14వ ఓవర్‌లో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించారు. ఈ ఓవర్ లో ఒక్కసారిగా 19 పరుగులు సాధించారు. దీంతో స్టేడియం మొత్తం బెంగాల్ అభిమానుల నినాదాలతో మారుమోగింది.
చివరి ఓవర్లలో ఉత్కంఠ
16 ఓవర్లకు బెంగాల్ 163/5కు చేరింది. జ్యామీ తన ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 46 బంతుల్లోనే 97 పరుగులు చేశారు. సెంచరీకి 3 పరుగుల దూరంలో కెప్టెన్ రితేష్ బౌలింగ్ లో భారీ షాక్ ఆడబోయి షబ్బీర్ కు దొరికిపోయాడు. మైదానంలో ఉన్నంత సేపు ముంబాయి బౌలర్లపై విరుచుకపడ్డారు. అతడు ఔటవ్వడం ముంబయికి ఊరటనిచ్చింది. కానీ అప్పటికే అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఆ తర్వాత రాహుల్ 44(20)వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి బెంగాల్ ఆశలను నిలబెట్టాడు. చివరి దశలో రత్నదీప్ 9 బంతుల్లో 18 పరుగులు జోడించి ఒత్తిడిని ముంబయిపైకి మళ్లించాడు.
19 ఓవర్లకు స్కోర్ 197/6గా మారడంతో బెంగాల్ విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి బెంగాల్ టైగర్స్ 203/6తో మ్యాచ్ గెలిచింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ సంచలన విజయం సాధించింది. బెంగాల్ టైగర్స్ ఈ మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి తమ ఛాంపియన్ స్థాయి ఏంటో మరోసారి నిరూపించారు. జ్యామీ చేసిన 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రాహుల్, రత్నదీప్ కీలక భాగస్వామ్యం కూడా విజయానికి కారణమైంది.
ఇక ముంబయి హీరోస్ బ్యాటింగ్‌లో షబ్బీర్ అలువాలియా, నవదీప్ తోమర్, నిషాంత్ దహియా రాణించినప్పటికీ బౌలింగ్‌లో కీలక దశలో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. చివరి ఓవర్లలో బెంగాల్ బ్యాట్స్‌మెన్‌లను అడ్డుకోవడంలో ముంబయి బౌలర్లు తడబడ్డారు. మొత్తంగా CCL 2026లో ఈ మ్యాచ్ ఇప్పటివరకు టోర్నీకి హైలైట్‌గా నిలిచింది. టోర్నీ మిగతా మ్యాచ్‌లు ఇంకా ఎంత ఉత్కంఠగా సాగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











