CCL 2026: పంజాబ్ చేజేతులా... సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్?
సినీ, క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2026 జనవరి 16న విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ ఆటగాళ్లతో సమానంగా స్టార్స్ కూడా గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఈ నేపథ్యంలో సీసీఎల్ 2026 ఎవరు కాబోతున్నారు? అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో గతేడాది సీసీఎల్ విజేతగా నిలిచిన పంజాబ్ ఈసారి పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టే పరిస్ధితి తెచ్చుకుంది. ఈ వివరాలు పరిశీలిస్తే..
ఉత్కంఠగా సీసీఎల్ మ్యాచ్‌లు
సీసీఎల్ 2026లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ - కర్ణాటక బుల్డోజర్స్.... రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ - భోజ్‌పురి దబాంగ్స్... మూడో మ్యాచ్‌లో ముంబై హీరోస్ - బెంగాల్ టైగర్స్... నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ - తెలుగు వారియర్స్ పోటీపడ్డాయి. ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ఈ సీజన్‌కు సంబంధించి ఏ టీమ్ బలమెంత? అనే దానిపై అభిమానులకు కొంత వరకు క్లారిటీ వచ్చేసింది.

రెండు మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో భోజ్‌పురి దబాంగ్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, తెలుగు వారియర్స్ జట్లు తలో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. భోజ్‌పురి దబాంగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా.. కర్ణాటక, బెంగాల్, తెలుగు వారియర్స్ జట్లు తర్వాత నిలిచాయి. మొదటి మూడు జట్లు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా.. తెలుగు వారియర్స్, పంజాబ్ దే షేర్ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. తెలుగు జట్టు ఒక విజయం సాధించగా.. పంజాబ్ టీమ్ ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పోరాడి గెలిచిన తెలుగు వారియర్స్
తొలి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో 31 పరుగుల తేడాతో పంజాబ్ దే షేర్ జట్టు ఓటమి పాలైంది. దాంతో టోర్నీలో నిలబడాలంటే తర్వాత జరిగే మ్యాచ్‌లలో పంజాబ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో తెలుగు వారియర్స్‌తో జరిగిన మ్యాచ్ ఆ జట్టుకు కీలకం. అదే సమయంలో తెలుగు వారియర్స్ జట్టు పరిస్ధితి కూడా ఇదే. తొలి మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ చేతిలో ఓడిపోవడంతో పంజాబ్‌పై అఖిల్ సేన ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. దాంతో విశాఖలో పంజాబ్ దే షేర్‌పై జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ సర్వశక్తులు ఒడ్డింది.
అఖిల్ విధ్వంసం
తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 101 పరుగుల చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అతనికి అశ్విన్ బాబు (60) నుంచి చక్కటి సహకారం అందింది. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 18.2 ఓవర్‌లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండు ఓటములతో పంజాబ్ జట్టు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లుగానే కనిపిస్తోంది.
వచ్చే వారం కీలకం
జనవరి 24వ తేదీన మధురైలో భోజ్‌పురి దబాంగ్స్‌తో పంజాబ్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే నేరుగా ఇంటికి వెళ్తుంది.. ఒకవేళ గెలిస్తే మాత్రం లెక్కలు మారతాయి. దానికి ముందు రోజు కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగే తెలుగు వారియర్స్ చివరి మ్యాచ్ కూడా పంజాబ్ భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ గెలిస్తే సెమీస్ ఆశలు సజావుగా ఉంటాయి. ఒకవేళ అఖిల్ సేన ఓడిపోతే మాత్రం సెమీస్ ఆశలు కష్టమే. వచ్చే వారం తెలుగు వారియర్స్, పంజాబ్ దే షేర్ జట్లకు అత్యంత కీలకం.. ఆ వారంతో సెమీస్ బెర్త్‌లు ఖరారు అవుతాయి. మరి సెమీస్ రేసులో ఎవరు నిలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











