Celebrity Cricket League 2023 తమన్ సునామీ ఇన్సింగ్స్.. కర్ణాటక చిత్తు.. ఫైనల్లో తెలుగు వారియర్స్
పాన్ ఇండియా వైడ్‌గా సినీ తారల మధ్య జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 తుది దశకు చేరుకొన్నది. గత వారాలుగా జరుగుతున్న ఈ టోర్నిలో ఆటగాళ్లు అంతర్జాతీ క్రికెట్‌లో జరిగే మ్యాచ్‌లకు ఏ మాత్రం తగ్గకుండా సినీతారలు తమ ప్రతిభను చాటుకొంటున్నారు.
శుక్రవారం రాత్రి అంటే మార్చి 24వ వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుపై తెలుగు వారియర్స్ జట్టు ఘన విజయం సాధించడమే కాకుండా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్న అఖిల్
వైజాగ్‌లో కిక్కిరిసిన అభిమానుల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అఖిల్ అక్కినేని టాస్ గెలుచుకొని తొలుత బౌలింగ్ ఎంచుకొన్నారు. 20 ఓవర్ల మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లు కర్ణాటక బుల్డోజర్స్, ఆ తర్వాత 10 ఓవర్లు తెలుగు వారియర్స్ చొప్పున రెండు జట్లు రెండు ఇన్పింగ్స్ ఆడాయి.

కర్ణాటక బుల్డోజర్ తొలి ఇన్సింగ్స్
తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక బుల్డోజర్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ జట్టులో సామ్రాట్ అత్యధికంగా 4 వికెట్లు సాధించాడు. కర్ణాటక జట్టులో అత్యధికంగా కెప్టెన్ ప్రదీప్ 26 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కృష్ణ 33 పరుగులు, చందన్ కుమార్ 5 పరుగులు, రాజీవ్ హను 4 పరుగులు చేశారు.

తెలుగు వారియర్స్ తొలి ఇన్సింగ్స్
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ జట్టు ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి తడబాటుకు గురైంది. కెప్టెన్ అఖిల్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో తెలుగు వారియర్స్ జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే అశ్విన్ తదితరులు బాధ్యతాయుతంగా ఆడటంతో 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.
తెలుగు వారియర్స్ జట్టులో అఖిల్ 14 పరుగులు, సచిన్ జోషి 10, ప్రిన్స్ 13, అశ్విన్ బాబు 36 పరుగలుు, రోషన్ 11, రఘు 4 పరుగులు చేశారు. కర్ణాటక కంటే 5 పరుగులు తక్కువ చేసింది. కర్ణాటక జట్టులో సునీల్ రావు, జయరామ్ కార్తీక్, ప్రదీప్ బోగడి చెరో వికెట్ తీసుకొన్నారు.

కర్ణాటక బుల్డోజర్స్ రెండో ఇన్సింగ్స్
తెలుగు వారియర్స్ జట్టు బ్యాటింగ్ తర్వాత కర్ణాటక బుల్డోజర్స్ రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించింది. రెండో ఇన్సింగ్స్‌లో కూడా కర్ణాటక భారీగానే పరుగులు సాధించింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు సాధించింది. సచిన్ జోషి 3 వికెట్లు తీసుకోవడం విశేషం. కర్ణాటక బుల్డోజర్ జట్టులో రాజీవ్ హను 32 పరుగులు, జయరాం 21 పరుగులు, కరణ్ ఆర్యన్ 13, బచ్చన్ 12, కృష్ణ 13 పరుగులు చేశారు.

తెలుగు వారియర్స్ జట్టు రెండో ఇన్సింగ్స్
తెలుగు వారియర్స్ జట్టు రెండో ఇన్సింగ్స్‌ను భారీ లక్ష్యంతో ప్రారంభించింది. విజయం కోసం 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే 6 పరుగులకే తెలుగు వారియర్స్ జట్టు అశ్విన్ బాబు వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రఘు, రోషన్ ఇద్దరు మంచి భాగస్వామ్యంతో జట్టును పటిష్టమైన స్థాయికి చేర్చారు. 27 పరుగులు చేసిన రోషన్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రఘు 22 పరుగులు చేసి గణేష్ బౌలింగ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఓ దశలో 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడినట్టు కనిపించింది.

తమన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి
అయితే జట్టును గెలిపించే బాధ్యతను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భుజాన వేసుకొన్నాడు. 20 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తమన్ ఆచితూచీ ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీగా పరుగులు చేశాడు. దాంతో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే తమన్ జట్టును విజయం వైపు నడిపించాడు. చివరి బంతిని బౌండరీకి తరలించి గెలుపు సాధించాడు.
15 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తెలుగు వారియర్స్ రెండో ఇన్నింగ్స్‌లో 9.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దాంతో ఆరు వికెట్ల తేడాతో కర్ణాటక బుల్డోజర్స్‌పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.


Click it and Unblock the Notifications











