CCL 2025 : ఒత్తిడికి తలవొగ్గిన చెన్నై రైనోస్.. తొలి మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ విక్టరీ
సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా చెన్నై రైనోస్ - బెంగాల్ టైగర్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ క్రికెట్, సినీ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించింది. ఇరువర్గాలు హోరాహోరీగా తలపడగా స్టార్స్ అంతా విజయమే లక్ష్యంగా బంతిని బౌండరీలకే తరలించడమే పనిగా చితకబాదారు. ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరించిందో చూస్తే :
తొలుత టాస్ గెలిచిన బెంగాల్ జట్టు కెప్టెన్ జిషు సేన్ గుప్తా బ్యాటింగ్ ఎంచుకోగా.. చైన్నై బౌలర్ల ధాటికి బెంగాల్ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. 10 ఓవర్లలో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది బోనీ 1, జమ్మీ 22, యూసఫ్ 14, జాయ్ 19, జిషుసేన్ గుప్తా 2 పరుగులు చేశారు. చెన్నై రైనోస్ బౌలర్లలో కలై 2, భరత్, శరణ్‌లు తలో వికెట్ తీశారు. అనంతరం 80 పరుగుల ఆధిక్యమే లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్ రమణ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు . ఏకంగా 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో బెంగాల్ టైగర్స్‌పై విరుచుకుపడి 28 పరుగులు చేశాడు.

రమణ ఇచ్చిన ఊపును మిగిలిన బ్యాట్స్‌మెన్ కంటిన్యూ చేయడంతో 8.5 ఓవర్‌లలోనే చెన్నై లీడింగ్‌లోకి వచ్చింది. భారీ సిక్సర్‌తో జట్టును లీడింగ్‌లోకి తీసుకొచ్చాడు అజయ్. మొత్తంగా 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 90 పరుగులు చేసి బెంగాల్‌పై 11 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో రమణ (28) , శరణ్ (20), విక్రాంత్ (4),పృథ్వీ (14), అజయ్ (20) పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్లలో రత్నదీప్ 2, ముకుల్ 1 వికెట్ పడగొట్టారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ టైగర్స్ రావడం రావడమే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లతో 15 పరుగులు రాబట్టి తుదివరకు అదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా జాయ్, రాహుల్‌లు ఊచకోత కోశారు. 4 ఓవర్లలోనే ఆ జట్టు 50 పరుగుల మార్క్ దాటిందంటే బెంగాల్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో తన రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయడంతో పాటు చెన్నై ముందు 101 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది బెంగాల్ టైగర్స్. జాయ్ 30, రాహుల్ 38, ఆనంద 11, జమ్మీ 7, రత్నదీప్ 2, యూసఫ్ 11, జిషుసేన్ గుప్తా 7 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శరణ్, విక్రాంత్, కలైలు మూడు వికెట్లు పడగొట్టారు.
101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది . తొలి ఓవర్ రెండో బంతికే అజయ్ ఔటయ్యాడు. లక్ష్యం భారీగా ఉండటంతో ఒత్తిడికి గురైన ఆ జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. చివరిలో దాశరథి, పృథ్వీ, పారిలు ధాటిగా ఆడినా చేతిలో బంతులు అయిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయడంతో బెంగాల్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అజయ్ 4, విక్రాంత్ 10, శంతను 10, పృథ్వీ 17, పారి 14, దాశరథి 28 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్స్‌లో ముకుల్ 2, జమ్మీ 2, రత్నదీప్ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సీసీఎల్ 2025లో తొలి విజయం సాధించిన జట్టుగా బెంగాల్ టైగర్స్ నిలిచింది.


Click it and Unblock the Notifications











