CCL 2025 Winner: సీసీఎల్‌లో చరిత్ర సృష్టించిన పంజాబ్ షేర్స్.. ఫైనల్లో చెన్నై దారుణ ఓటమి
దాదాపు నెల రోజులుగా జరుగుతున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025)కు మార్చి 2తో తెరపడనుంది. మైసూరులో జరిగిన ఫైనల్‌లో పంజాబ్ బే షేర్ VS చెన్నై రైనోస్ జట్లు తలపడ్డాయి. మరి ఈ రెండు జట్లలో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలవనుంది? చెన్నై రైనోస్ మూడోసారి విజేతగా నిలిచిందా? పంజాబ్ దే షేర్ తొలిసారి ట్రోఫీ అందుకుని కొత్త ఛాంపియన్‌గా నిలిచిందా? లేదా? అన్నది చూస్తే :
తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ హార్డీ సంధూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. దీంతో చెన్నైకి పరుగులు చేయడం కష్టంగా మారింది. స్టార్ బ్యాటర్లు రమణ, విక్రాంత్‌లు కూడా ఆచితూచి ఆడారు.
అయితే పంజాబ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో చెన్నై ఒత్తిడిలో పడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేకపోయింది. దీంతో చెన్నై రైనోస్ తన తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో రమణ 17, విక్రాంత్ 15, పృథ్వీ 23, అజయ్ 13, శరణ్ 13, శంతను 1, దాశరథి 7 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో సయ్యేష్ 2, బబ్బాల్ , దక్ష్‌లు తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కూడా బాగానే కట్టడి చేశారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహాపడ్డారు. కాసేపటికీ విక్రాంత్ బౌలింగ్‌లో కరణ్ (13) ఔట్ అయ్యాడు. అయితే మరో వికెట్ పడకుండా పంజాబ్ జాగ్రత్తలు తీసుకుని తమ స్కోరు బోర్డును 100 పరుగులు దాటించింది. రాహుల్ 43, బబ్బాల్ 40లు చివరి వరకు నిలవడంతో పంజాబ్ దే షేర్ తన తొలి ఇన్నింగ్స్‌లో 1 వికెట్ నష్టానికి 103 పరుగులు చేసి చెన్నైపై 13 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.
ఆపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై రైనోస్‌కు పంజాబ్ బౌలర్లు షాకిచ్చారు. ఓపెనర్లు శరణ్, అజయ్‌లను డకౌట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీతో కలిసి శంతను ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే పంజాబ్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీస్తూ చెన్నైని ఒత్తిడిలోకి నెట్టారు. ఆదుకుంటాడని అనుకున్న కెప్టెన్ విక్రాంత్ కూడా స్వల్ప పరుగులకే వెనుదిరగడంతో రైనోస్ కష్టాల్లో పడగా ఆ తర్వాత కోలుకోలేకపోయింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చెన్నై స్కోరు బోర్డు నత్త నడకన సాగింది.
దాశరథి ధాటిగా ఆడాలని చూసినా పంజాబ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి నిర్ణీత 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 6 వికెట్ల నష్టానికి 85 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ముందు 72 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో శరణ్ 0, అజయ్ 0, శంతను 22, పృథ్వీ 7, పరి 20, విక్రాంత్ 12, కలై 4, దాశరథి 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జెస్సీ 2, సుయ్యేష్, దక్ష్, నింజాలు తలో వికెట్ పడగొట్టారు.
72 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్ దే షేర్స్ ఏమాత్రం తడబాటు లేకుండా ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఓపెనర్లు అనుజ్, నింజాలు నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. ఈ దశలో అనుజ్ ఔటైనా అప్పటికే పంజాబ్ విజయం ఖరారైంది. చివరికి చెన్నై నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి ఛాంపియన్‌గా నిలిచింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో అనుజ్ 40, నింజా 11, హార్డీ 10, కరణ్ 2 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శరణ్ 2 వికెట్లు పడగొట్టారు.
కీలక ఆటగాళ్లు విక్రాంత్, అజయ్ తదితరులు విఫలం కావడంతో పాటు పంజాబ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దాదాపు 12 ఎక్స్‌ట్రాలు వేయడం చెన్నైని దెబ్బ కొట్టింది. లేదంటే పంజాబ్‌కు ఛేజింగ్ కాస్తంత కష్టమయ్యేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో పంజాబ్ దే షేర్స్ తొలిసారిగా సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) ఛాంపియన్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











