CCL 2025: బెంగాల్ టైగర్స్ దారుణ ఓటమి.. ఛాంపియన్లు చిత్తు.. ఫైనల్లో పంజాబ్ షేర్స్!
దాదాపు నెల రోజులుగా సినీ, క్రీడా అభిమానులకు అసలు సిసలు మజాను అందించిన సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) తుది అంకానికి చేరుకుంది. మార్చి 2తో ఈ మెగా టోర్నీకి ఫుల్ స్టాప్ పడనుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఏయే జట్లు తలపడనున్నాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మైసూర్‌లో పంజాబ్ దే షేర్ - బెంగాల్ టైగర్స్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారు? ఏ జట్టు తొలి ఫైనలిస్ట్‌గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది? ఈ వివరాల్లోకి వెళితే..

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ దే షేర్ కెప్టెన్ హార్డీ సంధూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తమ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బెంగాల్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగాల్ జట్టు సెమీఫైనల్ వరకు వచ్చేందుకు కీలకపాత్ర పోషించిన జమ్మీ , బోనీ, రాహుల్, ఆదిత్య వంటి వారు చేతులెత్తేశారు. రాహుల్ ఒక్కడే పంజాబ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచినా అతనికి సహకరించేవారు కరువయ్యారు.
దీంతో నిర్ణీత 10 ఓవర్లలో బెంగాల్ టైగర్స్ తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగాల్ బ్యాట్స్‌మెన్‌లలో ఆదిత్య 5, జమ్మీ 0, జిషు 0, రాహుల్ 46, జాయ్ 10, ఉదయ్ 2, బోనీ 10, యూసుఫ్ 9 , రత్నదీప్ 3 పరుగులు చేశారు. హర్డీ సంధూ 2, దక్ష్, రౌనక్, సుయ్యేష్, నింజాలు తలో వికెట్ పడగొట్టారు.
89 పరుగుల ఆధిక్యమే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ దే షేర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జబ్బాల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు నిలకడగా బ్యాటింగ్ చేయడంతో పాటు బెంగాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పంజాబ్ తన తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసి బెంగాల్‌పై 7 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో జబ్బాల్ 4, కరణ్ 31, రాహుల్ 13, అనుజ్ 16, హర్డీ 19, నింజా 3, దక్ష్ 2, మయూర్ 0 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్లలో ఆదిత్య, రాహుల్ రెండేసి వికెట్లు, జాయ్ , ఉదయ్ తలో వికెట్ పడగొట్టారు.
7 పరుగులు వెనుకబడి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బెంగాల్ టైగర్స్‌కు పంజాబ్ బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు ఏ దశలోనూ బెంగాల్ కోలుకోలేకపోయింది. స్టార్ బ్యాటర్లు జమ్మీ, రాహుల్ సహా అంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. యుసుఫ్ పోరాడినా అతనికి సహకరించే వారు లేకపోయారు.
దీంతో బెంగాల్ టైగర్స్ తన రెండో ఇన్నింగ్స్‌లో 9.4 ఓవర్లకు 71 పరుగుల వద్ద ఆలౌటై పంజాబ్ ముందు 65 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగాల్ బ్యాట్స్‌మెన్‌లలో జాయ్ 8, రాహుల్ 0, ఉదయ్ 1, జామీ 3, యూసుఫ్ 24, జిషుసేన్ గుప్తా 13, ఆదిత్య 10, ఆనంద 0, రత్నదీప్ 4, సౌరవ్ 0, బోనీ 0 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జబ్బాల్, హార్డీ, సయ్యేష్‌లు రెండేసి వికెట్లు, దక్ష్ ఒక వికెట్ పడగొట్టారు.
బెంగాల్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 6.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముఖ్యంగా ఓపెనర్లు హార్డీ , అనూజ్‌లు తొలి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో వీరిద్దరూ విధ్వంసం సృష్టించడంతో లక్ష్యం చిన్నదైంది. ఈ దశలో హర్డీ ఔటైనా అనూజ్ మాత్రం తన ఊచకోత కొనసాగించాడు.
కాసేపటికే జెస్సీ కూడా ఔటైనా అప్పటికే విజయం ఖరారైపోయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో హర్డీ 23, అనుజ్ 34, జెస్సీ 1, కరణ్ 4 పరుగులు చేశారు. రత్నదీప్, జమ్మీలు తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పంజాబ్ దే షేర్ సీసీఎల్ 2025లో ఫైనల్‌లో చేరిన తొలి జట్టుగా నిలిచింది. సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ - చెన్నై రైనోస్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు .. ఫైనల్‌లో పంజాబ్‌తో తలపడనుంది.


Click it and Unblock the Notifications











