CCL 2025: కర్ణాటక జైత్రయాత్రను పంజాబ్ అడ్డుకోగలదా?..సెమీస్ లెక్కలు మార్చే మ్యాచ్
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) తుది అంకానికి చేరుకుంది. ఈ వారంతో నాకౌట్ మ్యాచ్‌లు ముగిసి వచ్చే వారం నుంచి సెమీస్, ఫైనల్ జరగనున్నాయి. దీంతో సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకోవడానికి దీంతో అన్ని జట్లు చెమటోడుస్తున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతూ సినీ, క్రీడా అభిమానులకు మజాను అందిస్తున్నాయి. తొలుత అంతంత మాత్రంగా టికెట్ అమ్మకాలు ఉండగా.. గత వారం నుంచి క్రికెట్ లవర్స్ మైదానాలకు పోటెత్తుతున్నారు.
ఫిబ్రవరి 8న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రారంభమవ్వగా.. ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లు జరిగాయి. తాజా సీజన్‌లో కిచ్చా సుదీప్ సారథ్యంలోని కర్ణాటక బుల్డోజర్స్, జిషుసేన్ గుప్తా సారథ్యంలోని బెంగాల్ టైగర్స్ జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాయి. ఆటగాళ్లంతా మంచి ఫాంలో ఉండటంతో ఈ రెండు జట్లతో పోటీకి దిగాలంటేనే మిగిలిన జట్లు వణుకుతున్నాయి. సుదీప్, జిషుసేన్‌లు తమ జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు.

కర్ణాటక, బెంగాల్ జట్లు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి చెరో 6 పాయింట్లతో నిలిచాయి. కాకపోతే కిచ్చా సుదీప్ బుల్డోజర్స్ మాత్రం నెట్ రన్ రేట్ (+2.839) విషయంలో దూకుడుగా వ్యవహరించి ఓవరాల్‌గా టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత బెంగాల్ టైగర్స్ +0.861 రన్ రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. పాయింట్లు కర్ణాటకతో సమానంగా వచ్చినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా బెంగాల్ టైగర్స్ రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఈసారి విజేత ఖచ్చితంగా ఈ రెండు జట్లలో ఒకటి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత భోజ్‌పురి దబాంగ్స్ , తెలుగు వారియర్స్, చెన్నై వారియర్స్, పంజాబ్ దే షేర్‌లు ఒక్కోటి చొప్పున గెలిచాయి. ముంబై హీరోస్ ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానం కోసం ముంబై తప్పించి మిగిలిన నాలుగు జట్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూరత్‌లో ఫిబ్రవరి 22న కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌తో చెన్నై రైనోస్ తలపడనుంది. ఆ వెంటనే సాయంత్రం 6.30 గంటలకు జరిగే మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌ను పంజాబ్ దే షేర్ ఢీకొట్టనుంది.
అన్ని రంగాల్లో బలంగా ఉన్న సుదీప్ సేనను పంజాబ్ ఏ మేరకు నిలువరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తమ జైత్రయాత్రను కొనసాగించాలని కర్ణాటక బుల్డోజర్స్ పట్టుదలగా ఉంది. తద్వారా నాకౌట్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ గెలిచి సెమీస్‌లో బరిలో దిగాలని కర్ణాటక భావిస్తోంది. అటు కర్ణాటక జోరుకు బ్రేకులు వేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పంజాబ్ కూడా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఒక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే -0.345 నెట్ రన్ రేట్‌తో మిగిలిన జట్ల కంటే మెరుగ్గానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











