CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026... బోణీ కొట్టిన కర్ణాటక బుల్డోజర్స్.. తొలి మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి
సినీ, క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2026 (సీసీఎల్ 2026) ఘనంగా ప్రారంభమైంది. జనవరి 16న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ - వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు సీసీఎల్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్‌పై కర్ణాటక బుల్డోజర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక బుల్డోజర్స్ 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయి.. పంజాబ్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 18.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రదీప్ బౌలింగ్‌లో సచిన్‌కు క్యాచ్ ఇచ్చి నింజా డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రాహుల్ జైట్లీ, బబ్బాల్ రాయ్‌లు జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న దశలో జట్టు స్కోర్ 17 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్ సుదీప్‌కు క్యాచ్ ఇచ్చి బబ్బాల్ రాయ్(1) ఔట్ అయ్యాడు. ఆ కాసేపటికే సునీల్ బౌలింగ్‌లో కెప్టెన్ హార్డీ సంధూ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత చందన్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 32 పరుగుల వద్ద జెస్సీ (3) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. అనంతరం సచిన్ బౌలింగ్‌లో దక్ష్(1) ఎల్‌బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు.
35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ రాహుల్ జైట్లీ, సావంత్‌లు జట్టును నడిపించాడు. ముఖ్యంగా రాహుల్ ఆచితూచి ఆడుతూనే, భారీ షాట్స్‌తో స్కోరు బోర్డ్‌ను 100 పరుగులు దాటించాడు. ఈ దశలో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ కుదురుకుంటున్న దశలో కరణ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి 68 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రదీప్‌కు దొరికిపోయాడు. దీంతో మ్యాచ్ తిరిగి కర్ణాటక చేతుల్లోకి వచ్చింది. ఆ కాసేపటికే కరణ్ మరో షాకిచ్చాడు. మంచి ఊపు మీదున్న విక్రమ్ జిత్(7) షాట్‌కు యత్నించి ప్రదీప్‌కు క్యాచ్ ఇచ్చి 114 పరుగుల వద్ద 7వ వికెట్‌గా వెనుదిరిగాడు.
చివరిలో బ్యాట్ ఝళిపించిన సావంత్ (28).. కార్తీక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే చివరిలో సయ్యేష్, అనూజ్‌లు ఒంటరి పోరాటం చేశారు. ఈ క్రమంలో 18.3వ ఓవర్‌లో ప్రదీప్ బౌలింగ్‌లో అనూజ్ (11) భారీ షాట్‌కు యత్నించి ఔట్ కావడంతో 139 పరుగుల వద్ద పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో కర్ణాటక తన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో రాహుల్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కర్ణాటక బౌలర్లలో ప్రదీప్ 4, కరణ్, కార్తీక్, సచిన్‌లు రెండేసి వికెట్లు, సునీల్, చందన్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
కర్ణాటక ఇన్నింగ్స్
అంతకుముందు తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ హర్దీ సందూ ఫీల్డింగ్ ఎంచుకుని కర్ణాటకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. డార్లింగ్ కృష్ణ, ప్రదీప్‌లు కర్ణాటక ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ.. అప్పుడప్పుడు బౌండరీలతో విరుచుకుపడ్డారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దక్ష్ సింగ్ విడదీశాడు. 31 పరుగుల వద్ద దూకుడు మీదున్న డార్లింగ్ కృష్ణ (14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన రాజీవ్ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో కర్ణాటక వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ వెంటనే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సుదీప్ (0)ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేసి సీసీఎల్ 2026లో తొలి హ్యాట్రిక్ అందుకున్నాడు దక్ష్ సింగ్. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఓపెనర్ ప్రదీప్ (17) నింజా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కర్ణాటక బుల్డోజర్స్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ప్రతాప్, కార్తీక్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దాంతో 8 ఓవర్లకు కర్ణాటక జట్లు 50 పరుగుల మార్క్ చేరుకుంది. ఆ కాసేపటికే జట్టు స్కోరు 53 పరుగుల వద్ద దక్ష్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి కార్తీక్ (16) ఔట్ కావడంతో కర్ణాటక 5వ వికెట్ కోల్పోయింది.
అయితే ఇలాంటి పరిస్ధితుల్లోనూ కరణ్, ప్రతాప్‌లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా కరణ్ అయితే ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతని దెబ్బకు 14 ఓవర్‌లలో కర్ణాటక బుల్డోజర్స్ 100 పరుగుల మార్క్‌ను దాటింది. ఇలాంటి దశలో కార్తీక్ అనవసరమైన పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. కరణ్ మాత్రం తన జోరు కొనసాగిస్తూ కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో జట్టు స్కోరు 155 పరుగుల వద్ద చందన్ (13), 157 పరుగుల వద్ద సునీల్ (1) రనౌట్‌గా పెవిలియన్ చేరారు. జట్టుకు వెన్నెముకగా నిలిచిన కరణ్ ఆర్యన్ (83) దక్ష్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జట్టు స్కోరు 169 పరుగుల వద్ద 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరికి హార్డీ బౌలింగ్‌లో సచిన్ (0) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగడంతో 19.2 ఓవర్లలో కర్ణాటక 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ బౌలర్లలో దక్ష్ సింగ్ 5 వికెట్లు, హార్డీ, నింజాలు తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











