పాప పుట్టడంతో మూడు గంటలు ఏడుస్తూనే ఉన్నాడు.. చలాకీ చంటి కన్నీటిగాథ
వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు చలాకి చంటి. అసలు పేరు వినయ్ మోహన్ అయితే... రేడియో స్టేషన్‌లో వర్క్ చేసినప్పుడు చంటిగా మారానని... జబర్దస్త్‌కి వచ్చాక చలాకీ చంటిగా స్థిరపడిపోయానని చెప్పుకొచ్చాడు. చలాకీ చంటిగా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు ఓర్చుకోవాల్సి వచ్చిందని సినిమా అవకాశాలు అంత ఈజీగా ఏమీ రాలేదని చంటి తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు.

ఆ ఘటన..
ఇండస్ట్రీలోకి రావడానికి కారణం హీరోయిన్ ఊహా అని చంటి చెప్పుకొచ్చాడు. పదో తరగతి చదివేటప్పుడు తన స్కూల్‌లో తానే కల్చరల్ లీడర్ అట. దానివల్ల అందరూ తనకు కొంచెం భయపడుతూ.. గౌరవం ఇచ్చేవాళ్లని తెలిపాడు. ఓ సారి మా స్కూల్‌లో వార్షికోత్సవ వేడుకలకు నటి ఊహ అతిథిగా వచ్చిందట. ఆ ఘటనే చలాకీ చంటి జీవితాన్ని మలుపు తిప్పిందని తెలుస్తోంది.

సెలెబ్రిటీ అవ్వాలని..
అయితే ఊహా స్టేజ్ ఎక్కగానే.. అప్పటివరకూ తనకు గౌరవమిచ్చిన తోటి విద్యార్థులందరూ.. ‘ఉహ గారు కనిపించడం లేదు కూర్చో' అని తిట్టడం ప్రారంభించారట. సెలబ్రిటీ అయితే తప్పకుండా గౌరవం లభిస్తుందని అనిపించిందట. ఇండస్ట్రీలోకి వచ్చి సెలెబ్రిటీ అవ్వాలనే కోరిక అప్పుడే పుట్టిందని చంటి చెప్పుకొచ్చాడు.

చాలా సినిమాలు పోయాయి..
మొదటి సినిమా జల్లు ఆడలేదని చంటి చెప్పుకొచ్చాడు. ఆ తరువాత చాలా కాలానికి భీమిలీ కబడ్డి జట్టులో చేశానని, అది హిట్ అయినా మంచి పేరు వచ్చినా మరో ఆఫర్ రాలేదని చెప్పాడు. తన గురించి అందరూ బ్యాడ్‌గా చెప్పడం, సెట్‌కి టైంకు రానని, కేరవ్యాన్ అడుగుతానని ఇలా అసత్యాలు చెప్పడంతో తనకు దాదాపు 16 సినిమాలు పోయాయని చంటి తెలిపాడు.
Recommended Video

మూడు గంటలు ఏడ్చాను..
ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అగ్నిప్రమాదం జరిగి కళ్లెదురుగానే అమ్మ చనిపోయిందని చంటి ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు తనకు ఐదేళ్లుంటాయని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు ఏం తెలీదని.. పదిరోజుల తర్వాత అమ్మ చనిపోయిందని అర్థమయ్యిందని చెప్పాడు. ఆ రోజు బాగా ఏడ్చానని.. ఆ తర్వాత మళ్లీ ఏడ్చింది నా కూతురు పుట్టాకే అని చెప్పుకొచ్చాడు. మా పాప పుట్టాక మూడు గంటలపాటు ఏడుస్తూనే ఉన్నానని.. అమ్మ తిరిగి నా దగ్గరకు వచ్చేసిందనిపించిందంటూ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











