ఉప్పెన గ్రాండ్ సక్సెస్ పార్టీ.. చిరంజీవి, అల్లు అర్జున్ హంగామా.. ఫోటోలు వైరల్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన ఉప్పెన చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. తొలి పరిచయంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న నేపథ్యంలో మైత్రీ మూవీస్ గ్రాండ్‌గా పార్టీని ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి సంబంధించిన వివరాలు మీ కోసం..

భారీ అంచనాలతో ఉప్పెన
లాక్‌డౌన్‌కు ముందే విడుదలకు సిద్దమైన ఉప్పెన చిత్రం థియేటర్లు మూతపడటంతో ఏడాదిపాటు రిలీజ్ కోసం ఆగాల్సి వచ్చింది. చివరకు ఫిబ్రవరి 12వ తేదీన ఉప్పెన చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.

ఉప్పెన వెనుక చిరంజీవి కీలక పాత్ర
ఉప్పెన చిత్రం విజయం వెనుక చిరంజీవి కీలక పాత్రనే పోషించారు. కథ, కథనాల నుంచి స్క్రిప్ట్ వర్క్‌లో కూడా మెగాస్టార్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చిరంజీవి ఇచ్చిన భరోసాతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లింది. ఓ దశలో ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించనప్పటికీ.. మెగాస్టార్ అభిప్రాయం మేరకు థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు ఎదురు చూసి రిలీజ్ చేశారు

28 రోజుల్లో 85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు
ఉప్పెన రిలీజ్ తర్వాత భారీ వసూళ్లను నమోదు చేసింది. గత 28 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 51.52 కోట్ల నికర వసూళ్లు, రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఏపీ, నైజాంలో రూ.47.72 కోట్ల నికర వసూళ్లు, 78.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ మూవీ యూనిట్ గ్రాండ్ సక్సెస్‌ను అందుకొన్నది.

చిరంజీవి, అల్లు అర్జున్ గెస్టులుగా
బాక్సాఫీస్ వద్ద ఉప్పెన గ్రాండ్ రన్ ముగిసిన నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మార్చి 19వ తేదీన వైభవంగా విందును ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో మైత్రీ పార్టీ ఫోటోలు
ఉప్పెన గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో మైత్రీ మూవీస్ నిర్వహించిన పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిత్ర యూనిట్‌తో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దిగిన ఫోటోలు అభిమానులు ఆకట్టుకొంటున్నాయి. ఈ వేడుకలో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవి ప్రకాశ్, మైత్రీ సీఈవో చెర్రీ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











