ప్రిన్స్ డయానా పెళ్లిని మించి.. 5 వేల కోట్లతో అంబానీ కొడుకు పెళ్లి.. వెడ్డింగ్ కార్డు ధర ఎన్ని లక్షలంటే?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో ఘనంగా జరిగింది. ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుక యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్‌తో పాటు ప్రపంచ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా తదితర రంగాలకు చెందిన అతిరథ మహారథులు అనంత్ అంబానీ వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి అంటే తరతరాలు చెప్పుకోవద్దు. అందుకు తగ్గట్టుగానే గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. తన సంపద ప్రదర్శనకు, తన అట్టహాసానికి, తన దర్పానికి, తన ఆడంబరానికీ అనుగుణంగా తనయుడి పెళ్లిని జరిపించారంటూ కార్పోరేట్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అంబానీ అక్షరాల రూ.5 వేల కోట్లను ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారని అంచనా.

ఇక ఈ వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేకంగా బహుమతులను తయారు చేయించింది. అన్నింటిలోకి అత్యంత ఖరీదైన అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన వాచీలను కానుకగా ఇచ్చారట. దీని ఒక యూనిట్ ధర అక్షరాల రూ.2 కోట్లు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌లు ఈ వాచీలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. వీటిని ఎంత మందికి ఇచ్చారో తెలియదు కానీ వీటి ఖరీదే వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది.
ఇదొక్కటే కాదు.. అంబానీల పెళ్లిలో ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. ఒక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ధరే ఏకంగా రూ.6.50 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఆహ్వాన పత్రికలో మూడు కేజీల వెండి ఆలయం, అందులో 24 క్యారెట్ల బంగారు దేవతా విగ్రహలు ఉన్నాయి. అయితే అనంత్ అంబానీ గ్రాండ్ మ్యారేజ్ నేపథ్యంలో నెటిజన్లు కొన్ని లెక్కలు చెబుతున్నారు. భారతదేశంలో ఉద్యోగుల ఏడాది మొత్తం వేతనం అంబానీల ఒక్క వెడ్డింగ్ కార్డ్‌తో సమానమని, కొందరి వార్షిక ఆదాయమైతే అందులో సగం కూడా ఉండదని కామెంట్స్ పెడుతున్నారు.
అంతేనా.. ఇప్పటి వరకు ఖరీదైన పెళ్లిగా చెప్పుకుంటున్న ప్రిన్సెస్ డయానా - ప్రిన్స్ ఛార్లెస్ వివాహానికి అయిన ఖర్చును కూడా అంబానీ బద్ధలు కొట్టారని అంటున్నారు. 1981 జూలై 29న జరిగిన ప్రిన్సెస్ డయానా పెళ్లి కోసం అప్పట్లోనే రూ.1361 కోట్లను (ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా) వెచ్చించారని అంచనా.

అంబానీ పెళ్లిని మెచ్చుకునేవారితో పాటు విమర్శించేవారు అదే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. రూ.5 వేల కోట్లను ఏదైనా మంచి పనికోసం వెచ్చించి ఉంటే.. దాని వల్ల లబ్ధి పొందిన మనుషులు, కుటుంబాలు తరతరాలు అంబానీని గుర్తుంచుకునేవని కామెంట్స్ పెడుతున్నారు. వీరికి కొందరు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ముఖేష్ అంబానీ పెట్టిన ఖర్చు సమాజంలో పంపిణీ జరిగిందని వాదిస్తున్నారు.
వెడ్డింగ్ కార్డ్, నగలు , వధువరూల దుస్తులు, ఫోటో షూట్‌లు, డెకరేషన్, స్పెషల్ ఫ్లైట్లు, విందు భోజనాలు , అతిథులకు ఇచ్చిన ఖరీదైన బహుమతుల తయారీ కారణంగా వేల మందికి పని దొరికిందని వారు చెబుతున్నారు. ఇది కూడా ఒకరకంగా సేవేనని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ అంబానీల పెళ్లి మాత్రం చరిత్రలో నిలిపోయిందన్నది మాత్రం వాస్తవం.


Click it and Unblock the Notifications











