మిమ్మల్ని కోల్పోవడమే మాకు అతి పెద్దలోటు: విక్టరీ వెంకటేష్ ఆవేదన
దివంగత డాక్టర్ రామానాయుడు జయంతి (జూన్ 6) సందర్బంగా ఎమోషనల్ ట్వీట్ పెడుతూ ఓ అరుదైన పిక్‌ని షేర్ చేశారు విక్టరీ వెంకటేష్. తన తండ్రితో ఆయనకున్న అనుబంధాన్ని, తండ్రి పట్ల అతని ప్రేమను తెలిపేలా సందేశం పెట్టారు వెంకటేష్. ఈ మేరకు తాను, చిన్నప్పటి నాగ చైతన్య, రామానాయుడు కలిసి ఉన్న రేర్ పిక్ అందరి ముందు పెట్టాడు.
'మీరు మాతో ఉంటే చాలు. మీ కలను మేము నిజం చేస్తాం నాన్న. మిమ్మల్ని కోల్పోవడమే మాకు అతి పెద్దలోటు. హ్యాపీ బర్త్‌డే' అంటూ వెంకటేశ్ తన తండ్రికి చెప్పిన శుభాకాంక్షలు చూసి ఆనంద పడుతున్నారు దగ్గుబాటి అభిమానులు. మరోవైపు నిన్న(గురువారం) రామానాయుడు జయంతి సందర్బంగా మనవడు నాగచైతన్య కూడా ఓ ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది. తమ వెంకీ మామ చిత్రాన్ని రామానాయుడు గారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నాడు చైతూ. ప్రస్తుతం నాగచైతన్య, వెంకటేష్ కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు కాస్త రీల్ లైఫ్ మామ అల్లుళ్ళు కావడంతో ఈ సినిమాపై ప్రెస్కాహుల్లో ఆసక్తి నెలకొంది.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త సమర్పణలో 'వెంకీ మామ' తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. పల్లెటూరి నేపథ్యంతో పాటు, ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనూ సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను ద్వారా అర్థమైంది. చూడాలి మరి ఈ రియల్ మామా అల్లుళ్ళు రీల్ మామా అల్లుళ్లుగా ఏ మేర వినోదం పండిస్తారో!


Click it and Unblock the Notifications











