HBD Pawan Kalyan: నా అప్పుల కష్టాల్లోంచి గట్టెక్కించడానికే గబ్బర్ సింగ్..రెమ్యునరేషన్ అంతా ఇచ్చేసి..నాగబాబు
జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. తన మేనరిజం, స్టైల్, డిఫరెంట్ యాక్టింగ్‌తో పవన్ టాలీవుడ్‌పై చెరగని ముద్ర వేశారు. నటుడిగా కంటే వ్యక్తిగానే చాలా మంది ఆయనను ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే పవన్ తట్టుకోలేరు.. వారికి తన చేతనైన సాయం చేస్తారు. బయటివారికే కాదు కుటుంబ సభ్యులను సైతం పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఈ లిస్ట్‌లో స్వయంగా తన అన్నయ్య నాగబాబు కూడా ఉన్నారు. తమ్ముడు తనను ఆదుకున్న సంగతిని స్వయంగా ఆయనే పలుమార్లు బయటపెట్టారు.
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో పవర్‌స్టార్ బ్లాక్‌బస్టర్ మూవీ గబ్బర్ సింగ్‌ను 4కే వెర్షన్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో హిట్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు దర్శకుడు హరీశ్ శంకర్. పవన్ సరసన శృతీ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మే 11, 2012లో సమ్మర్ కానుకగా రిలీజైన గబ్బర్ సింగ్ సంచలన విజయం నమోదు చేసింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు... 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది.

నిజానికి ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేయలేదు.. కేవలం అన్నయ్య నాగబాబును అప్పుల్లో నుంచి గట్టెక్కించడానికే చేశారట. ఆరెంజ్ సినిమా మిగిల్చిన నష్టాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు డిప్రెషన్‌లోకి వెళ్లారు. దీంతో ఆయనను ఆదుకునేందుకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్.. రూ.5 కోట్ల సాయంతో పాటు తన నెక్ట్స్ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ మొత్తాన్ని ఇస్తానని మాటిచ్చారట. అదే గబ్బర్ సింగ్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు స్వయంగా వెల్లడించారు.
గబ్బర్ సింగ్ లాభాలతో అన్నయ్య అప్పులు తీర్చి మిగతా ఎంత మిగిలితే అంత నువ్వు తీసుకో, నా రెమ్యునరేషన్ సంగతి తర్వాత చూద్దాం అని అగ్రిమెంట్ సమయంలో నిర్మాత బండ్ల గణేష్‌తో పవన్ అన్నారట. సినిమా సెట్స్ పైకి వెళ్లాక హరీశ్ శంకర్ పవన్‌ను కొత్త మేకోవర్ చేయడంతో గబ్బర్ సింగ్ బాగా తయారై బాగా నమ్మకం కుదిరిందట. దీంతో సినిమా రిలీజ్‌కు ముందు పవన్ కళ్యాణ్ అగ్రిమెంట్‌ను పూర్తిగా మార్చేశారట. అంత బాగా సినిమా వచ్చినప్పుడు ఏ హీరో అయినా స్వార్ధంగా ఆలోచిస్తాడని, కానీ పవన్ మాత్రం నువ్వు కష్టపడి కథ తెచ్చుకున్నావని గణేష్‌తో అన్నారట. నీ ప్రాఫిట్స్‌లో నుంచి ఏమీ తీయొద్దు, కానీ నాకు రెమ్యునరేషన్ ఇవ్వు.. ఆ డబ్బుతో అన్నయ్యని సేవ్ చేసుకుంటానని పవన్ ప్రపోజల్ తెచ్చినట్లు నాగబాబు గుర్తుచేసుకున్నారు.
గబ్బర్ సింగ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు లేదని.. కేవలం తనను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. అప్పటికీ పవన్ కళ్యాణ్ ఆర్ధిక పరిస్ధితి కూడా ఏం బాలేదని నాగబాబు తెలిపారు. గబ్బర్ సింగ్ రెమ్యునరేషన్‌తో తన అప్పులన్నీ తీర్చేశాడని.. ఒకరకంగా చెప్పాలంటే అదంతా నాకే ఇచ్చినట్లని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ కళ్యాణ్ మంచి మనసును ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











