హృదయాన్ని కదలించేలా.. దేవుడు చల్లగా చూడాలి: విజయ్ దేవరకొండకు పేద మహిళల విషెస్
కరోనా లాక్‌డౌన్ సందర్భంగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మే 9న జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొందరు ఘనంగా శుభాకాంక్షలు అందించారు. విజయ్ దేవరకొండకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌లో పెట్టిన వీడియో ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తున్నది.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మధ్య, దిగువ తరగతి ప్రజలు ఉపాధి, ఆదాయాన్ని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది మూడు పూటలా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పేదవారి ఆవేదనను అర్ధం చేసుకొన్న విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో నిత్యావసర వస్తువులు, అనారోగ్యంతో బాధపడేవారికి మందులు అందించారు. ఈ క్రమంలో సహాయం అందుకొన్న కొందరు ప్రజలు విజయ్ దేవరకొండకు తమదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కరోనా సమయంలో మాకు ఆర్థిక సాయం అందించినందుకు ధన్యవాదాలు. ఒక మెసేజ్ సాయంతో నిత్యావసర వస్తువులను అందించారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు అని ఒకరు తెలిపారు. ఇక మరో మహిళ మాట్లాడుతూ.. మేము ఎవరి వద్ద సహాయం పొందలేదు. చిన్నవాడైనా మా బాధలను అర్ధం చేసుకొని సాయం చేశారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అన్నారు.
పేదవాళ్లను ఆదుకోన్నందుకు చాలా మంది గుర్తు చేసుకొంటున్నారు. మీరు కలకాలం చల్లగా ఉండాలి. మిమల్ని దేవుడు చల్లగా చూడాలి. పుట్టిన రోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు అని మరో మహిళ విషెస్ తెలియజేశారు.
కరోనా సమయంలో మీరు మమల్ని, మా పిల్లల్ని ఆదుకొన్నారు. ఈ కష్టకాలంలో ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లో మీరు ఒక మెసేజ్ ద్వారా సాయం అందించినందుకు ధన్యవాదాలు. మీరు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అంటూ మరో మహిళ విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు అందించారు.
గత పది రోజులుగా మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో విజయ్ దేవరకొండ పలు కుటుంబాలను ఆదుకొన్నారు. ఇప్పటి వరకు 8 వేలకుపైగా కుటుంబాలకు సాయం అందించారు. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











