First Photo: ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడిన సోనాక్షి సిన్హా .. ఏడేళ్ల బంధమంటూ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో పెళ్లి సందడి ఎక్కువగా ఉంది. తాజాగా స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన చిరకాల మిత్రుడు జహీర్ ఇక్బాల్‌లను వివాహం చేసుకున్నారు. ఇవాళ వారి వివాహం ముంబైలో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా మీడియా వెల్లడించింది.
తమ వివాహం గురించి సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో సైలెంట్‌గా పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చారు. ఏడేళ్ల కిందట ఇదే రోజున కలిశాం.. ఒకరినొకరు చూసుకున్నాం, అదే రోజున నిర్ణయించుకున్నాం, ఆ ప్రేమ మమ్మల్ని నడిపించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా తోడుగా నిలిచింది.

మా రెండు కుటుంబాల ప్రేమ, దీవెనలతో ఒక్కటయ్యాం అంటూ సోనాక్షి రాసుకొచ్చారు. వీరి వివాహానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హ్యూమా ఖురేషి, సిద్ధార్, అదితీ రావ్ హైదరీ, అర్పితా ఖాన్, ఆయుష్ శర్మ తదితరులు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సోనాక్షి- ఇక్బాల్‌లు 2022లో డబుల్ ఎక్స్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా బీ టౌన్ మీడియా కోడై కూసింది. అయితే అంతకు ఐదేళ్ల ముందు నుంచే వీరిద్దరి ప్రేమ, డేటింగ్ మొదలైందట. అయితే సోనాక్షి హిందూ అమ్మాయి కాగా.. ఇక్బాల్ ముస్లిం. వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చినప్పుడే కొందరు పెదవి విరిచారు కూడా. స్వయంగా సోనాక్షి తల్లి, సోదరుడు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లుగా ప్రచారం జరిగింది. తల్లి కొడుకులిద్దరికి వీరి వివాహం ఇష్టం లేదని వార్తలు వచ్చాయి.
అయితే శత్రుఘ్న సిన్హా ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇది తన ఏకైక కుమార్తె వివాహామని, ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని.. పెళ్లికి ఖచ్చితంగా హాజరవుతానని తేల్చిచెప్పారు. వివాహానికి ముందు నూతన వధూవరులు హల్దీ , మెహందీ, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సోనాక్షి తన పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలావుండగా సోనాక్షి .. జహీర్‌ను పెళ్లిచేసుకున్న నేపథ్యంలో సోనాక్షి సిన్హా ఇస్లాం మతంలోకి మారుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను జహీర్ తండ్రి , సోనాక్షి మామగారు ఇక్బాల్ రతాన్సీ గతంలోనే ఖండించారు. ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం జరగదన్నారు. ఇది సివిల్ మ్యారేజ్ అని .. సోనాక్షి మతం మారరని .. ఇది కేవలం రెండు హృదయాల కలయిక మాత్రమేనని, మతానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని రతాన్సీ చెప్పారు.
తాను మానవత్వాన్ని మాత్రమే నమ్ముతానని.. హిందువులు భగవాన్ అన్నా, ముస్లింలు అల్లా అన్నా చివరికి మనమంతా మనుషులమని రతాన్సీ వెల్లడించారు. పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్‌లు తమ సన్నిహితులు , కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం దాదర్‌లోని ది బాస్టిన్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ తారలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించేందుకు తరలిరానున్నారు.


Click it and Unblock the Notifications











