Independence Day 2023: తెలుగులో దేశ భక్తిని రగింలించిన చిత్రాలు.. ఎన్టీఆర్ నుంచి శ్రీకాంత్ వరకు!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తుంటాయి. అందులో దేశ భక్తిని రగిలించే చిత్రాలు కూడా తెరకెక్కుతూ ఉంటాయి. ఇలా టాలీవుడ్‌లో వందల సంఖ్యలోనే సినిమాలు రూపొందాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను పొందడంతో పాటు అందరిలో దేశంపై ప్రేమను కలిగేలా చేశాయి. మరి కొద్ది రోజుల్లో స్వతంత్ర దినోత్సవం రాబోతున్న నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా వచ్చిన తెలుగు సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి!

అల్లూరి సీతారామరాజు: తెలుగు సినిమాల్లో దేశ భక్తి అంటే ముందుగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' ఒకటి. వీ రామచంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్యం వీరుడి స్వాతంత్ర్య పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. అదే సమయంలో కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది.

బొబ్బిలి పులి: దేశ భక్తితో కూడిన సినిమాల్లో ఎన్టీఆర్ - దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో రూపొందిన 'బొబ్బిలి పులి' ఒకటి. ఒక మిలటరీ అధికారి స్టోరీతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో ఎంతో మందిని చైతన్య వంతం చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఎన్టీఆర్ కనబరిచిన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

మరో ప్రపంచం: ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్రావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'మరో ప్రపంచం'. దేశ భక్తితో పాటు అసలైన స్వాతంత్ర్యం, స్వేచ్చ, సామాజిక అసమానతలు, పేదరికం, వివక్ష వంటి వాటిని ప్రస్తావిస్తూ తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మందిని చైతన్యవంతం చేసింది.

మేజర్ చంద్రకాంత్: పైన పేర్కొన్న సినిమాలన్నీ పాత తరం వాళ్లకు తెలిసినవి అయితే.. 90 దశకం వాళ్లు మాత్రం చూసిన దేశ భక్తి చిత్రమే 'మేజర్ చంద్రకాంత్'. ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో కమర్షియల్ హంగులతో కూడిన దేశ భక్తిని కూడా సినీ లోకానికి చాటి చెప్పి కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఖడ్గం: కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'ఖడ్గం'. దేశ భక్తికి సరైన అర్థం చెప్పేలా పూర్తి స్థాయి భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ప్రస్తుత తరం వాళ్ల మెప్పును పొందింది. కమర్షియల్‌గానూ సక్సెస్ కావడంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఇండిపెండెన్స్‌డేకు ఈ చిత్రం ప్రదర్శితం అవుతోంది.

RRR: దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన చిత్రమే RRR. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథలతో రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో దేశ భక్తికి స్నేహాన్ని కూడించి చూపించారు. ఫలితంగా ఇది దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని.. ఆస్కార్‌ను కూడా అందుకుంది.
ఎన్నో సినిమాలు: పైన పేర్కొన్న సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో చిత్రాలు దేశ భక్తిని చాటి చెప్పాయి. అందులో 'సర్ధార్ పాపారాయుడు', 'వందేమాతరం', 'పరమవీరచక్ర', 'సుభాష్ చంద్రబోస్', 'మహాత్ముడు', 'ఘాజీ', 'రాజన్న' ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇవి మాత్రమే కాదు.. డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో ప్రేక్షకులను అలరించి.. దేశంపై ప్రేమను పెంచాయి.


Click it and Unblock the Notifications











