IPL 2025 Closing Ceremony: ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మెరవనున్న సినీ స్టార్స్.. ఎవరెవరంటే?
దాదాపు రెండు నెలల నుంచి క్రికెట్ ప్రేమికులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) మరికొద్దిగంటల్లో ముగియనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. దాదాపు 18 ఏళ్లుగా ఈ రెండు జట్లు ఐపీఎల్ కప్ గెలవాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. కానీ ప్రతిసారి దురదృష్టం వెక్కిరిస్తుండటంతో ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ ట్రోఫీ కొట్టాలని రెండు జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి.
ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ vs పంజాబ్
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ జట్లు పలుమార్లు ఫైనల్‌కు వెళ్లాయి. ఆర్సీబీ 2009, 2011, 2016లలో.. పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్‌కు వెళ్లాయి. కానీ వీటికి నిరాశే ఎదురైంది. అలాంటిది ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరడంతో ఏ జట్టు కొడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లలో ఏది గెలిచినా చరిత్ర సృష్టించినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు జట్లు బలాబలాల విషయంలో సమంగానే ఉండటంతో ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆపరేషన్ సిందూర్‌తో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌తో ఐపీఎల్ ఆగిపోయింది. పలువురు విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు కూడా వెళ్లిపోయారు. అయితే భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తిరిగి ప్రారంభమైంది. యుద్ధం జరగకపోయుంటే ఐపీఎల్ ఈపాటికే ముగిసిపోయేది కూడా. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ఫైనల్‌ను తొలుత మే 25న నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. దానిని జూన్ 3కి మార్చారు.
ఫైనల్‌లో భారత సైన్యానికి సెల్యూట్
తొలుత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వాతావరణ పరిస్దితుల దృష్ట్యా ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు. 2022, 2023లలో ఐపీఎల్ ఫైనల్‌లను నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించారు. మరోవైపు ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ధైర్య సాహసాలతో పాకిస్తాన్‌ను మట్టి కరిపించడంతో భారత త్రివిధ దళాధిపతులను ఫైనల్‌కు ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఫైనల్‌కు తరలిరానున్న సెలబ్రెటీలు
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు గాను మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ గాయకులు దేశభక్తి గీతాలను ఆలపించనున్నారు. పహల్గామ్ ఉగ్రవాద డాదిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడంతో పాటు స్టేడియంలోని పలు చోట్ల జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు గుర్తుగా ముగింపు వేడుకలను సాయుధ బలగాలకు అంకితం చేయాలని నిర్ణయించారు. మరోవైపు.. ఐపీఎల్ ముగింపు వేడుకలకు సినీ, రాజకీయ, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్ధ్ మహదేవన్‌లు పాల్గొంటారని సమాచారం. దీంతో ఈసారి ఐపీఎల్ ముగింపు వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











