IPL 2025: ప్లే ఆఫ్స్ వేళ పంజాబ్ జట్టులో కలకలం.. మోసం చేశారంటూ కోర్ట్‌కెక్కిన ప్రీతి జింటా
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌తో భారత ఉప ఖండంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల మాదిరిగానే క్రికెట్‌పైనా ఆపరేషన్ సింధూర్ ప్రభావం చూపింది. పాకిస్తాన్‌లో పీఎస్ఎల్, భారత్‌లో ఐపీఎల్ లీగ్స్ అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి సాధారణ పరిస్ధితులు నెలకొనడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తిరిగి ప్రారంభమైంది.
ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు
ఐపీఎల్ వాయిదాపడే నాటికి కొన్ని లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో వాటిని పూర్తి చేసి ప్లే ఆఫ్స్ పోటీలు నిర్వహించాలని బీసీసీఐ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్ధితుల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ఫైనల్‌ను తొలుత మే 25న నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. దానిని జూన్ 3కి మార్చారు.

అహ్మదాబాద్‌లో ఫైనల్?
అయితే దీనికి వేదిక ఎక్కడన్నది మాత్రం బీసీసీఐ నిర్ణయించలేదు. తొలుత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 ఫైనల్ నిర్వహించాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో కోల్‌కతాకు భారీ వర్షసూచన చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్‌కు తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2022, 2023లలో ఐపీఎల్ ఫైనల్‌లను నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కి పంజాబ్
ఇకపోతే.. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఖరారైన వేళ విజయం సాధించి షాకిచ్చింది పంజాబ్. కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు జట్టును విజయవంతంగా నడిపిస్తున్నారు. 2014లో చివరిసారిగా ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్ కొట్టాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉంది. ఇలాంటి దశలో పంజాబ్ కింగ్స్ జట్టులో కలకలం రేగింది. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇందుకు కారణమయ్యారు.
ఏం జరిగిందంటే:
కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ప్రీతి జింటా, మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నెల 21న నిర్వహించిన ఈ కంపెనీ బోర్డు సర్వ సభ్య సమావేశం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ప్రీతి జింటా చండీగఢ్ కోర్టుకెక్కారు. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈ సమావేశాన్ని నిర్వహించారంటూ నెస్ వాడియా, మోహిత్ బుర్మాన్‌లపై ప్రీతి కేసు వేశారు. ఈ సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 10న తాను మెయిల్ ద్వారా తెలిపినప్పటికీ వారిద్దరూ పట్టించుకోలేదని ప్రీతి పిటిషన్‌లో పేర్కొన్నారు.
మునీష్ ఖన్నా నియామకం చెల్లదన్న ప్రీతి
ఇదే సమావేశంలో మునీష్ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడాన్ని ప్రీతి జింటా, మరో డైరెక్టర్ కరణ్ పాల్ వ్యతిరేకిస్తున్నారు. మునీష్ ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా కంపెనీ అమలు చేయకుండా చూడాలని ప్రీతి జింటా కోరారు. అలాగే తాను, కరణ్ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన తరుణంలో ప్రీతి వ్యవహారం జట్టులో చర్చనీయాంశమైంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











