Chanakya, Rise సర్వేల ప్రభావం.. జనసేనలోకి భారీ వలసలు.. ఇద్దరు నిర్మాతలకు పవన్ టికెట్ కన్ఫర్మ్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగు ప్రజల దృష్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైకి మళ్లింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరికి విజయవకాశాలు ఉన్నాయనే కోణంలో ప్రైవేట్ సర్వేలు వెల్లడిస్తున్న ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరేందుకు పలువురు సినీ ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారనే విషయం వైరల్ అవుతున్నది. ఈ క్రమంలో జనసేనలోకి వెళ్లిన నిర్మాతలు, రాబోయే సినీ ప్రముఖుల గురించిన వివరాల్లోకి వెళితే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేలా తాకిడి భారీగానే ఉండబోతున్నది. ఇప్పటికే చాణక్య, రైజ్ సర్వే ఫలితాలు కొందరిలో గుబులు రేపితే.. మరో వర్గానికి ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తున్నది. దాంతో జనసేన పార్టీలో చేరేందుకు పలువురు సినీ ప్రముఖులు ప్రయత్నాలు ప్రారంభించారనే విషయం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల చాణక్య సర్వే తమ ఫలితాలను వెల్లడిస్తూ.. జనసేన, టీడీపీ కూటమికి 128 సీట్లు రాబోతున్నాయని స్పష్టం చేసింది. ఇక రైజ్ సర్వే కూడా అత్యధిక స్థానాలు ఈ కూటమికే రావొచ్చు అని సర్వే ఫలితాలను వెల్లడించింది. దాంతో ఏపీ రాజకీయాల్లో మార్పులు చేర్పులు అనివార్యంగా మారాయి.
ఇక తాజాగా చాణక్య, రైజ్ సర్వేలు జనసేన, టీడీపీ కూటమికి పాజిటివ్ ఫలితాలను ఇవ్వడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి అధికార మార్పు తప్పదని సర్వేలు చూపించడం ఏదో ఒక పార్టీలో టికెట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకొనే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీలో ఇద్దరు ప్రముఖ నిర్మాతల అధికారికంగా చేరిపోయారు. కొందరు నటులు కూడా జనసేనలోకి వచ్చారు. అత్తారింటికి దారేది నిర్మాత భోగవల్లి ప్రసాద్ అలియాస్ బీవీఎస్ఎన్ ప్రసాద్, అలాగే మరో నిర్మాత బన్నీ వాసు కూడా జనసేనలోకి చేరిపోవడం తెలిసిందే. ఇప్పటికే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్, బన్నీ వాసుకు టికెట్లు ఖరారు అయినట్టు తెలుస్తున్నది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బన్నీ వాసు అసెంబ్లీకి పోటి చేయడానికి రంగం సిద్దం చేసుకొన్నాడు. త్వరలోనే ఈ ఇద్దరు నిర్మాతలకు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నారు.
ఇక పోత్తులో భాగంగా జనసేన పార్టీకి టీడీపీ ఎక్కువ మోతాదులో సీట్లు కేటాయించనున్నదనే వార్తల మధ్య సినీ, రాజకీయ నేతల వలసలు మొదలయ్యాయి. సినీ ప్రముఖులు కూడా త్వరలోనే పవన్ కల్యాణ్ సమక్షంలో చేరడం ద్వారా ఆ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











