2025 Year Ender: నందమూరి హీరోలకు ‘పాన్ ఇండియా’ చేదు అనుభవం.. ఎన్టీఆర్, బాలయ్యకు 2025 భారీ ఎదురుదెబ్బ!
తెలుగు సినిమా టాలెంట్ సరిహద్దులను చెరిపేస్తున్నది. టాలీవుడ్ చిత్రాలకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు లభిస్తున్నది. తెలుగు హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లకు ప్రపంచ సినిమా పటంపై క్రేజ్ పెరుగుతున్నది. ఇటీవల రాజమౌళి లాంటి దర్శకుడి చిత్రాలే కాకుండా ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి డైరెక్టర్ల చిత్రాలకు విదేశాల్లో భారీ గుర్తింపు లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో నందమూరి హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు 2025 సంవత్సరంలో ప్రయత్నించారు. వారి ప్రయత్నం వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా రంగంలో గత 50 ఏళ్లుగా నందమూరి బాలకృష్ణ తనదైన నటన, కథా చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. లక్షలాది మంది అభిమానులను తెలుగు సినీ ప్రపంచంలో సొంతం చేసుకొన్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబ వారసత్వంతో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగారు. దేశవ్యాప్తంగా మంచి పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఆ క్రమంలో ఇద్దరు నందమూరి హీరోలు తమ చిత్రాలను పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్దమయ్యారు.

2025 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ హై రేంజ్‌లో ఇండియన్ ఆడియెన్స్‌కు చేరువ కావడానికి వార్ 2 సినిమాతో సిద్దమయ్యారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో నిర్మాత ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఓ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన 2025 న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
వార్ 2 సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా వాల్యూ కట్టడం జరిగింది. అయితే వార్ 2 చిత్రం తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్‌తో ముందుకు సాగింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా ఇండియాలో 285 కోట్లకు అటు ఇటుగా, ఓవర్సీస్‌లో 85 కోట్ల రూపాయలు వసూలు చేసి దాదాపు 370 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫలితం విషయానికి వస్తే.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఉహించని విధంగా డిజాస్టర్‌గా మారింది.
ఇక సంవత్సరం చివర్లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం అనేక సమస్యలను అధిగమించి ఎట్టకేలకు డిసెంబర్ 12 తేదీన ఆకాశాన్ని అంటే అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు బాలయ్య కెరీర్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా ఆశించినంతగా సానుకూలమైన టాక్ ఆడియెన్స్ నుంచి సంపాదించకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడానికి తంటాలు పడుతున్నది. ఈ సినిమా భారీ నష్టాలతో ముగిసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఓవరాల్‌గా 2025 సంవత్సరం నందమూరి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నాన్ని భారీగా చేశారు. కానీ తాము నటించిన సినిమాల్లో కథ, కథనాలు నేషనల్ లెవెల్‌లో ఆడియెన్‌ను ఆకట్టుకొలేకపోయాయి. దాంతో ఈ ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా అటెంప్ట్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. 2025 సంవత్సరం కలిసి రాకపోవడం వారి అభిమానులకు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.


Click it and Unblock the Notifications











