60 ఏళ్ల వయసులో కూడా బాక్సాఫీస్ బద్దలు .. సీనియర్ హీరోల జోరుకు కుర్ర హీరోలు బేజారు!
ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు... దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. అదేమిటంటే కుర్ర హీరోలకి పోటీగా 60 ఏళ్లు దాటినా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ కలెక్షన్లు కొల్లగొట్టడమే కాదు. కుర్ర హీరోలకి పెద్ద టార్గెట్స్ కూడా ఇస్తున్నారు. ఏ ఏ భాషల్లో ఏ ఏ సీనియర్ హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిజానికి ఇప్పుడు దాదాపుగా తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లో సీనియర్ హీరోల హవా కనిపిస్తోంది. వాస్తవానికి 60 ఏళ్లు వచ్చిందంటే హీరోలుగా రిటైర్ అయ్యి తండ్రి పాత్రలు చేస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో మాత్రం సీనియర్ హీరోలు తమ సత్తా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని తమ తాజా చిత్రాలతో నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సీనియర్ హీరోల హవా చూస్తుంటే మెంటల్ మాస్ అన్నట్టుగా సాగిపోతోంది.

ముందుగా తమిళ సినీ పరిశ్రమ విషయానికి వస్తే... అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్ సీనియర్ హీరోలుగా ఉన్నారు. చాలా కాలం నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వీరిద్దరూ చివరిగా విక్రమ్ జైలర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాదు విక్రమ్ సినిమా ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టి తమిళ్ సినిమా రికార్డులు బద్దలు కొడితే... జైలర్ సినిమా కూడా ఏకంగా నాలుగే రోజుల్లో 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ లెక్కలు తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్, ధనుష్ వంటి వారు ఈ రికార్డులు బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.

తెలుగు హీరోల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇద్దరూ కూడా ఆసక్తికరంగా పోటాపోటీగా సినిమాలు చేయడమే కాదు కుర్ర హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా కాస్త ఇబ్బంది పెట్టింది కానీ... అంతకుముందు ఆయన చేసిన వాల్తేరు వీరయ్య గానీ, గాడ్ ఫాదర్ సినిమా కానీ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుని వసూళ్ల వర్షం కురిపించాయి. ఒకరకంగా కుర్ర హీరోలు అందరికీ ఆయన చాలా పోటీ ఇస్తున్నారు అని చెప్పాలి.
అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా అఖండ సినిమాతో పాటుగా వీరసింహారెడ్డి సినిమాతో హిట్టు అందుకుని కుర్ర హీరోలకి పోటీగా నిలుస్తున్నారు. కేవలం తెలుగు, తమిళ హీరోలే ఇలా పోటీగా నిలుస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.. బాలీవుడ్ లో సన్నీ డియోల్ కూడా నేను కూడా ఏమాత్రం వెనక పడలేదనే చెప్పుకునే ప్రయత్నం చేశారు.
20 ఏళ్ల క్రితం ఆయన చేసిన గద్దర్ సినిమాకి పోటీగా ఇప్పుడు గద్దర్ 2 సినిమా చేశారు. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తుంది. ఏకంగా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. ఆ విధంగా 60 దాటాక కూడా ఈ హీరోలు రిటైర్మెంట్ వయసు వచ్చిందని రిలాక్స్ అవ్వకుండా కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ ఉండడంతో వారంతా బేజారు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











