CCL 2026 Winner: సీసీఎల్ 2026 విజేత కర్ణాటక బుల్డోజర్స్.. బెంగాల్ టైగర్స్ దారుణ ఓటమి
సినీ తారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు బెంగాల్ టైగర్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపును సాధించి ట్రోఫిని సొంతం చేసుకొన్నది. ఈ టోర్నమెంట్‌లో తిరుగులేని ఆటను ప్రదర్శించిన కిచ్చ సుదీప్ జట్టు టైటిల్‌ను మరోసారి ఎగురేసుకుపోయింది. గత 12 ఏళ్ల తర్వాత కర్ణాటక జట్టు ట్రోఫిని గెలుచుకోవడం గమనార్హం. ఈ టోర్నమెంట్‌లో కన్నడ జట్టు విజయం సాధించడం మూడోసారి. జట్టును విజయ పథంలో నడిపించిన రాజీవ్ హనుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్ల మధ్య కోయంబత్తూరులోని ఎస్ఎన్ఆర్ కాలేజ్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో సుదీప్ సేన ఫీల్డింగ్‌కు దిగింది. అయితే ఓపెనర్లు జాయ్ కుమార్ ముఖర్జీ, ఉదయ్ ప్రతాప్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 5 పరుగులు చేసిన ఉదయ్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరారు. దాంతో మొదటి వికెట్‌ను బెంగాల్ జట్టు స్కోరు 6 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జామీ బెనర్జీతో కలిసి జాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే 4 పరుగులు చేసిన జామీ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. దాంతో బెంగాల్ జట్టు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే జాయ్ కుమార్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. కెప్టెన్ జిషు సేన్ గుప్తాతో కలిసి మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. జట్టు కుదురుకొన్నదనుకొనే సమయంలో జిషు 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన జాయ్ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. 96 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన బెంగాల్ జట్టును కర్ణాటక జట్టు బౌలర్లు చావుదెబ్బ కొట్టారు. దాంతో బెంగాల్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. చివర్లో ఇంద్రాషిస్ రాయ్ (17), ఆనంద చౌదరీ (12) పరుగులు చేయడంతో 129 పరుగుల విజయలక్ష్యాన్ని కర్ణాటక ముందు ఉంచింది. కర్ణాటక బౌలర్లలో ప్రతాప్ కురి 3 వికెట్లు, సునీల్ కుమార్ 2 వికెట్లు, కరణ్ ఆర్యన్ ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం 130 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టు ఆదిలోనే ఓపెనర్ నిరుప్ భండారీ వికెట్ కోల్పోయింది. 2 రన్స్ చేసి రాహుల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డార్లింగ్ కృష్ణ, కరణ్ ఆర్యన్, కార్తీక్ జయరామ్ తక్కువ స్కోర్లకే వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో కర్ణాటక జట్టు ప్రమాదంలో పడినట్టు కనిపించింది. డార్లింగ్ కృష్ణ 7 పరుగులు, కరణ్ 3 పరుగులు, కార్తీక్ 15 పరుగులు చేశారు. అయితే మంజునాథ్ గౌడతో కలిసి ఓపెనర్ రాజీవ్ హను జట్టును విజయ తీరానికి చేర్చారు. దాంతో సీసీఎల్ 2026 కప్ కర్ణాటక జట్టు వశమైంది. కన్నడ జట్టులో ఆనందం వెల్లువిరిసింది. 69 పరుగులు చేసిన రాజీవ్ హనుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బెంగాల్ జట్టులో రణ్‌దీప్ 3 వికెట్లు పడగొట్టారు. రాహుల్ ఒక వికెట్ తీసుకొన్నాడు.


Click it and Unblock the Notifications











