HBD Ravi Teja: ఒక్క ఛాన్స్ అంటూ స్టార్‌గా.. ఆ బడా హీరోల కంటే ఎక్కువ సంపాదన.. రవితేజ ఆస్తి ఎంతంటే!
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినీ రంగంలోకి ప్రవేశించి.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా పరిచయమై.. తనదైన అద్భుతమైన టాలెంట్లతో స్టార్‌గా ఎదిగిపోయాడు రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఓ రేంజ్‌లో అలరించిన అతడు.. మాస్ మహారాజాగా మారాడు. అప్పటి నుంచి పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. అలాగే, వేగంగా మూవీలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా అతడి రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం పదండి!
అలా వచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా:సినిమా పిచ్చితో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన రవితేజ.. మొదట్లో పలువురు డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలను పోషించాడు. ఈ క్రమంలోనే 'సింధూరం' అనే చిత్రంలో అదిరిపోయే పాత్రతో హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సహాయ నటుడిగా నటించాడు. దీంతో రవితేజకు మంచి గుర్తింపు కూడా లభించింది.

హీరోగా వరుస హిట్లు కొట్టాడు:చాలా చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తర్వాత 'నీకోసం' అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంతో భారీ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక, 'ఇడియట్'తో స్టార్‌గా ఎదిగి.. అప్పటి నుంచి సత్తా చాటుతున్నాడు.
మధ్యలో ఫ్లాపులు వచ్చాయి:హీరోగా మారిన తర్వాత ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. చాలా కాలం పాటు వరుసగా ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాస్ హీరో మళ్లీ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. తద్వారా తన రేంజ్‌ను భారీగా పెంచుకుంటున్నాడు.

హిట్ కోసం.. ఈగల్‌గా మారి:2022 చివర్లో 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన రవితేజ.. ఆ తర్వాత 'వాల్తేరు వీరయ్య'తోనూ భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే, 2023లో అతడు నటించిన 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు మాత్రం అంతగా ఆడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో 'ఈగల్' మూవీ చేశాడు. ఇది ఫిబ్రవరి 9న రాబోతుంది.
హరీష్‌తో అది.. అనుదీప్‌తో:హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా మాస్ మహారాజా ఇప్పటికే ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూట్ కూడా మొదలైంది. అలాగే, అనుదీప్ కేవీ దర్శకత్వంలోనూ ఓ సినిమాను మాస్ హీరో రవితేజ లైన్‌లో పెట్టుకున్నాడు.
ఆ స్టార్ల కంటే ఎక్కువ చార్జ్:కెరీర్ ఆరంభంలో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న రవితేజ.. 'క్రాక్' మూవీ ముందు వరకూ రూ. 10 - 12 కోట్లు చార్జ్ చేసేవాడు. దీని తర్వాత దాన్ని రూ. 15 కోట్లకు పెంచాడని తెలిసింది. ఇక, 'ధమాకా' హిట్ తర్వాత రవితేజ ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 20 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. ఇది టాలీవుడ్ సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అని టాక్.

రవితేజకు అన్ని కోట్ల ఆస్తి:ప్రస్తుతం రవితేజకు రూ. 150 కోట్లు నికర విలువ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ. 30 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట. అలాగే, దాదాపు రూ. 6 కోట్లు విలువైన కార్లు, రూ. 2 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ. 50 కోట్లు విలువైన ఫ్లాట్లు ఉన్నాయట. వీటిలో ఆయన భార్య కల్యాణీ పేరిటే సగానికి పైగా రాసినట్లు తెలిసింది.
మాస్ మహారాజా రవితేజ మరెన్నో విజయాలను చూడాలని.. ఎంతో మంది ప్రతిభావంతులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఈ స్టార్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











