పిట్ట కొంచెం కూత ఘనం: తండ్రికి అండగా ప్రచారంలో దూసుకెళ్తున్న నిహారిక.. బరిలోకి వరుణ్, అల్లు అర్జున్
Recommended Video

సూర్యకాంతం చిత్రంతో సినీ ప్రేక్షకులకు చేరువైన మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లతో మమేకం అవుతున్నారు. బాబాయ్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన తరఫున ప్రచారానికి నిహారిక బరిలోకి దిగారు. త్వరలోనే మెగా హీరోలు ఎన్నికల ప్రచారం చేపడుతారనే మెగా వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

నరసాపురంలో విస్తృత పర్యటనలు
నరసాపురం పార్లమెంట్ స్థానంలో పోటీకి దిగిన తండ్రి నాగబాబుతో నిహారిక విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండ్రితోపాటు జీప్‌లో ప్రయాణిస్తూ జనసేన పార్టీకి అండగా నిలువాలని పిలుపునిస్తున్నారు. అలాగే ప్రాంత అభివృద్ధికి తండ్రి నాగబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని హుషారైన ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొంటున్నారు.

మరో నాలుగు రోజులపాటు ప్రచారం
గోదావరి జిల్లాలో తండ్రి నాగబాబుతోపాటు నిహారిక మరో నాలుగు రోజులు పర్యటించనున్నట్టు ఆమె పీఆర్ వర్గాలు వెల్లడించాయి. నిహారికతోపాటు నిర్మాత, పీఆర్వో సురేష్ కొండేటి కూడా నాగబాబు వెంట విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిర్మాత సురేష్ కొండేటి ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. నిహారిక ప్రచారానికి మంచి మద్దతు లభిస్తున్నది. మరో నాలుగు రోజులు ప్రచారం చేస్తారు. నాగబాబు విజయం సాధిస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రచారానికి వరుణ్ తేజ్, అల్లు అర్జున్
ఏపీ ఎన్నికల్లో రాజకీయ గ్లామర్ తోడు కావడం ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. త్వరలోనే మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు తెలుస్తున్నది. వీరిద్దరూ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఉగాది తర్వాత ఎన్నికల ప్రచారబరిలోకి మెగా హీరోలు
ఉగాది పండుగ తర్వాత మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఆంధ్రాలో పర్యటించనున్నట్టు తెలిసింది. జనసేన పార్టీ తరుఫున పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేసే విధంగా జనసేన వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తంగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నందున ఆయన పోటీ చేస్తున్న భీమవరంలో, గాజువాకలో మెగా హీరోలు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

రాంచరణ్ రాకపై సందిగ్ధత
ఏపీ ఎన్నికల నేపథ్యంలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ ప్రచారానికి వస్తారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నికలకు దూరంగా ఉండటం కారణంగా నాగబాబుకు, పవన్ కల్యాణ్‌కు రాంచరణ్ ప్రచారం చేస్తారా అనే విషయం సందిగ్ధంగానే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉత్తర భారతంలో RRR షూటింగ్‌లో బిజీగా ఉండటం కూడా ఓ కారణమని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











