కంపుకు దూరంగా ఎన్టీఆర్, రాంచరణ్... RRR పేరుతో రాజమౌళి భలే తప్పించారు!
ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నది. అధికారంలోకి రావడానికి ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. గతంలో రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉండేది. కానీ ఈసారి జనసేన పార్టీ కూడా తన సత్తాను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇలాంటి కీలక సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ఎన్నికల హీట్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ రాజకీయ వాతావరణానికి దూరంగా ఎందుకు ఉన్నారంటే..

RRR మూవీ షూటింగ్ బిజీలో
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న RRRలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఉత్తర భారతంలో జరుగుతున్నది. ఇటీవలే RRR జట్టు వడోదరకు ప్రయాణమైంది. అంతో ఇంతో పొలిటికల్ టచప్ ఉన్న వీరిద్దరూ ఏపీలో పొలిటికల్ సిట్యుయేషన్‌తో మాకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహారిస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పాలిటిక్స్‌కు దూరంగా జూనియర్ ఎన్టీఆర్
తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. పార్టీకి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబుతో ఉన్న అంతర్గత విభేదాల వల్ల పార్టీకి దూరమైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి మౌనంతో చెర్రీ సైలెంట్
ఇక గతంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం కోసం తన పరిధిలో రాంచరణ్ సహాయం అందించారు. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అల్లు అరవింద్ విజయం కోసం చెర్రీ ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడం, చిరంజీవి కూడా పాలిటిక్స్ దూరంగా ఉండటంతో రాంచరణ్ కూడా సైలెంట్ అయ్యాడు.

బాబాయ్‌లకు దూరంగా రాంచరణ్
అయితే బాబాయ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయంగా భీమవరం, గాజువాకలో అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో బాబాయ్ నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే జనసేనకు కుటుంబాన్ని దూరంగా ఉంచాలనే నిర్ణయం కారణంగా మెగా హీరోలు తాజా రాజకీయ వాతావరణానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.

రాజకీయాలతో విసిగిన ఎస్ఎస్ రాజమౌళి
గతంలో దర్శకుడు రాజమౌళికి లోక్‌సత్తా పార్టీతో అనుబంధం ఉంది. కాకపోతే ప్రత్యక్షంగా పాలిటిక్స్‌తో రిలేషన్స్ పెట్టుకోలేదు. కానీ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేకంగా డిజైన్లు అందించారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు పక్కన పెట్టడంతో రాజమౌళి మనస్తాపం చెందినట్టు కథనాలు వెలువడ్డాయి. ఇలా రాజకీయాలకు రాజమౌళి దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఓటు హక్కు వినియోగించుకొంటారా?
రాజకీయాలకు ఎంతో కొంతో అనుబంధం ఉన్న రాజమౌళి, రాంచరణ్, తారక్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండటం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రయోజనాలకు కీలకంగా మారే ఈ ఎన్నికలకు దూరంగా ఉండి షూటింగ్ చేయడం సబబేనా. ఇంతకు కనీసం ఓటు వేయడానికి వస్తారా? అనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











