Oscars: స్వర్గీయ కోటా శ్రీనివాసరావుకు ఆస్కార్ అరుదైన గౌరవం
సినిమా ప్రపంచంలో నోబెల్ పురస్కారంగా భావించే ఆస్కార్స్ అవార్డుల వేడుక కన్నుల పండువగా ముగిసింది. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రాలను అవార్డులతో సత్కరించారు. తారల తళుకుబెళుకుల మధ్య అత్యంత ఉత్సాహంగా, జోష్‌తో సాగిన ఈ అవార్డుల వేడుకలో భారతీయ సినిమాకు విశేష సేవలందించి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన సినీ ప్రముఖులను ఆస్కార్ కమిటీ స్మరించుకొన్నది. 2025 సంవత్సరంలో మరణించిన భారతీయ సినిమా ప్రముఖులకు శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించింది. ఆస్కార్స్ నుంచి అరుదైన గుర్తింపు పొందిన నటీనటులు ఎవరనే వివరాల్లోకి వెళితే..
గత సంవత్సరం నుంచి భారతీయ సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టి ఈ లోకం వీడిన సినీ ప్రముఖుల్లో ధర్మేంద్ర, బీ సరోజా దేవీ, మనోజ్ కుమార్, బెంగాళీ చిత్రాల్లో నటించిన బంగ్లాదేశీ నటి జయశ్రీ కబీర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కృష్ణస్వామి, తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు.

భారతీయ సినిమా రంగానికి విశేష సేవలు అందించి స్వర్గస్తులైన ఈ ప్రముఖుల ఫోటోలను ఆస్కార్స్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచి నివాళ్లులర్పించింది. ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన జాబితాలో తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావుకు అరుదైన గుర్తింపు తన మరణాంతరం ఆస్కార్ నుంచి లభించడం మరువరానిది. విశేషంగా భావించాల్సిందే అని సినీ అభిమానులు, ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
స్వర్గీయ కోటా శ్రీనివాసరావు విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులకు అత్యంత సుపరిచితులు. కేవలం సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా రాణించారు. 1978 సంవత్సరంలో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడు మూళ్లు, దేవాంతకుడు చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటన చిత్రంలో కాశయ్య పాత్రతో ప్రజల నీరాజనాలు అందుకొన్నారు. ఆ తర్వాత ఎన్నో విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలతో నాలుగు దశాబ్దాలపాటు సినీ రంగానికి సేవలు అందించారు.
తన సినీ జీవితంలో సుమారుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు తొమ్మిది నంది అవార్డులు అందుకొన్నారు. భారతీయ సినిమాకు విశేష సేవలు అందించినందుకు గాను.. 2015 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకొన్నారు. ఆయన జూలై 13వ తేదీ 2025 రోజున స్వర్గస్తులయ్యారు. ఆయన లేని లోటును పూడ్చలేనిదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆస్కార్ సంస్థ కూడా ఆయనకు జోహార్లు అర్పించడం భారతీయులుగా గర్వపడాల్సిన విషయమని సినీ అభిమానులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











