TFI Fans Cricket League: చతికిలబడ్డ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. విజేతగా నిలిచిన ప్రభాస్ జట్టు!
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ (TFI Fans Cricket League) లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ జట్టు రోరింగ్ రెబెల్స్ ఘన విజయం సాధించి ట్రోఫిని సొంతం చేసుకొన్నది. పవన్ కల్యాణ్ అభిమానుల జట్టు హంగ్రీ చీటాస్‌తో నిర్ధేశించిన లక్ష్యాన్ని సునాయసంగా చేరుకొని విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హంగ్రీ చీటాస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. పవన్ కల్యాణ్ ప్యాన్స్ జట్టు తరుఫున వంశీ, మణి గోపి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత వంశీ అవుటయ్యాడు. 47 పరుగుల వద్దే వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ జగదీష్ పరుగులేమీ చేయకుండా అవుట్ కావడంతో కష్టాల్లో పడింది.

ఆ తర్వాత సౌరబ్, రాజ్‌తో కలిసి మణి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ ప్రభాస్ జట్టు బౌలర్లు విజృంభించడంతో మణి,సౌరబ్, రాజ్ వెంట వెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన చివరి బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

హంగ్రీ చీటాస్ జట్టులో వంశీ 20 పరుగులు, మణి గొపి 47 పరుగులు, సౌరబ్ 31 పరుగులు, రాజ్ 37 పరుగులు చేశారు. రోరింగ్ రెబల్స్ జట్టులో అక్షయ్ 4 వికెట్లు, శివాజీ, ఇంతియాజ్ చెరో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లలో బౌలర్లు కట్టడి చేయడంతో భారీ స్కోరు చేసే ప్రయత్నాలకు గండిపడింది.

158 పరుగులు స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రోరింగ్ రెబెల్స్ జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. అబిద్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 3 సీక్సర్లతో 47 పరుగులు చేయడంతో టార్గెట్ సులభమైంది. ఆ తర్వాత వచ్చిన ఇంతియాజ్ 18, ప్రకాశ్ రెడ్డి 13, సాయినాథ్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. అంకిత్ 40 పరుగులతో, అక్షయ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఇక హంగ్రీ చీటాస్ జట్టులో యష్ రెండు వికెట్లు, జగదీస్, ఉదయ్ కిరణ్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే ఈ టోర్నిలో బలమైన జట్టుగా, అత్యధిక స్కోర్లు చేసిన రోరింగ్ రెబెల్స్ జట్టు హవాను ఏ జట్టు కూడా నిలవరించకలేకపోయారు. దాంతో దిగ్విజయంగా ఈ టోర్నిని ప్రభాస్ అభిమానుల జట్టు ముగించింది. విజేత ట్రోఫితో అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.


Click it and Unblock the Notifications











