మరో ‘బాంబు’ పేల్చిన ప్రకాశ్ రాజ్.. సెన్సేషనల్ కామెంట్‌తో వేడెక్కిన పాలిటిక్స్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల కాలంలో రాజకీయపరమైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సామాజిక అంశాలపై, మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే సామాజిక కార్యకర్తగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సమకాలీన సమస్యలపై తన వాణిని వినిపిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాశ్ రాజ్ బాంబు లాంటి వార్తను పేల్చాడు. అదేమిటంటే..

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తా
నా అభిమానులకు, ప్రతీ ఒక్కరికి హ్యపీ న్యూ ఇయర్. కొత్త ఆరంభంతోపాటు ఈ సంవత్సరం అదనపు బాధ్యతలు చేపట్టబోతున్నాను. మీ అందరి సహకారంతో నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాను. నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతాను.

పార్లమెంట్‌లో నా గళం వినిపిస్తా
ఏ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాననే విషయంపై కొంత సమయం కావాలి. త్వరలోనే నేను ఆ విషయాన్ని వెల్లడిస్తాను. వచ్చే ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం ఉండాలి. సాధారణ ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తాను అని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో ప్రకాశ్ రాజ్ అధికార టీఆర్ఎస్‌కు సపోర్ట్‌గా నిలిచారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించడం కూడా చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజలను ఆలోచింప జేసే కామెంట్లు చేయడంతో ఆయన రాజకీయాల్లోకి రానున్నారనే ఊహాగానాలు వినిపించాయి.

సినీ, సాహిత్య, సామాజికంగా ప్రకాశ్ రాజ్
ప్రస్తుతం సినీ, సాహిత్య, సామాజిక రంగంలో ప్రకాశ్ బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగులో ఓ పుస్తకాన్ని రచించి ఆవిష్కరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఆయన సొంత రాష్ట్రం నుంచి బరిలోకి దిగుతారా లేదా తెలంగాణ నుంచి పోటీ చేస్తారా అనే అంశంపై చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











