IPL 2025: పంజాబ్ బ్యాట్స్‌మెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎగిరి గంతులేసిన ప్రీతీ జింటా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా పంజాబ్‌లోని మహారాజా యదవింద్రా సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విసిరిన సవాల్‌కు పంజాబ్ బ్యాట్స్‌మెన్లు ధాటిగా స్పందించారు. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ ఆటగాళ్లు కొట్టిన సిక్సర్లు, ఫోర్లకు ఆ జట్టు యజమాని సినీ నటి ప్రీతీ జింటా ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ కనిపించారు. ఈ మ్యాచ్‌లో ప్రీతీ జింటా హావభావాలు, మ్యాచ్ హైలెట్స్ వివరాల్లోకి వెళితే..
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. అయితే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టాయినోస్ లాంటి ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దాంతో పంజాబ్ జట్టులో నిరాశ నెలకొన్నది.

కష్టాల్లో చిక్కుకొన్న పంజాబ్‌ను ప్రియాంశ్ ఆర్య ధాటిగా ఆడుతూ సిక్సర్లు ఫోర్లతో బోర్డుపై స్కోరును పరుగు పెట్టించారు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి అతివేగంగా అర్ధసెంచరీ సాధించిన రెండో వ్యక్తిగా నిలిచాడు. అదే జోష్‌ను కొనసాగిస్తూ 39 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. దాంతో అతివేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
ఇక స్టేడియంలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన జట్టు యజమాని ప్రీతి జింటా ప్రతీ ఫోర్ కొట్టినప్పుడు, సిక్సర్లు బాదినప్పుడు ఆనందంలో ఎగిరి గంతేశారు. పక్కనే ఉన్న తన సన్నిహితులతో హై ఫై ఇచ్చుకొంటూ సంతోషంలో మునిగిపోయారు. ఆమె హావభావాలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. జట్టు ఆటగాళ్లకు జోష్ పుట్టిస్తూ తనదైన రీతిలో ప్రోత్సాహాన్ని గ్యాలరీ నుంచి అందించారు.
ఇక తమ జట్టు విసిరిన 220 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు చెన్నై జట్టు తడబాటుకు గురైన ప్రతీ సందర్భంలోను హ్యాపీగా కనిపించారు. జట్టు యాజమాన్యంతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. చెన్నై ఆగటాళ్లు అవుట్ అయిన ప్రతీ సందర్భంలో గ్యాలరీలో ఎగిరి గంతులేస్తూ కనిపించారు.


Click it and Unblock the Notifications











