షారుక్ ఖాన్ టీమ్‌పై గెలుపు.. క్రికెటర్‌కు ప్రీతి జింటా టైట్ హగ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. ఈ లీగ్‌లో ప్రతీ జట్టు అద్బుతమైన పోరాటపటిమను చూపుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నాయి. భారీ స్కోర్లు సాధించిన జట్టుపై ఛేజింగ్ చేస్తూ విజయాలు సాధించడం ఓ పక్కన, తక్కువ స్కోరుకు అవుట్ చేసి.. దానిపై గెలుపు సాధించే దృశ్యాలు క్రికెట్ అభిమానులను అబ్బురపరుస్తున్నాయి. మంగళవారం ఏప్రిల్ 15వ తేదీన పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ అభిమానులకు నరాలు తెంచే అనుభూతిని పంచింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత బాలీవుడ్ నటి, పంజాబ్ జట్టు సహ భాగస్వామి ప్రీతీ జింటా చూపిన ఉత్సాహం అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ మ్యాచ్ వివరాలు, ప్రీతీ జింటా హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ టోర్నమెంట్‌ను సినీ తారల గ్లామర్ మంచి కిక్కెక్కిస్తున్నది. కోల్‌కతా నైట్ రైడర్ జట్టుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఓ యజమానిగా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీ జింటా ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మ్యాచ్‌లు జరిగే సమయంలో తన ఫ్యామిలీతో కలిసి వచ్చి అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ప్రీతీ జింటా తన జట్టు సభ్యులకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు.

అయితే ఈ ఇద్దరు స్టార్లు యజమానులుగా ఉన్న జట్లు మంగళవారం నువ్వా? నేనా అనే విధంగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొన్నది. అయితే కోల్‌కతా నైట్ రైడర్లు విజృంభించడంతో 15.3 ఓవర్లలోనే పంజాబ్ 111 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30, ప్రియాంశ్ ఆర్య 22 పరుగులు చేశారు. హర్షిత్ రాణా 3 వికెట్లు, సునీల్ నరైన్, వరుణ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తర్వాత 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా జట్టు ఓ దశలో నిలకడగానే ఆడుతూ కనిపించింది. అయితే పంజాబ్ బౌలర్ యజువేంద్ర చాహల్ విజృంభించి 4 వికెట్లు తీయడంతో కోల్‌కతా జట్టు కుప్పకూలింది. చాహల్‌కు తోడుగా జాన్‌సేన్ 3 వికెట్లు పడగొట్టడంతో దారుణంగా ఓటమిపాలైంది. 15.1 ఓవర్లలో 95 పరుగులు చేసి ఔట్ అయ్యారు. రఘువంశీ 37 పరుగులు చేయడం విశేషంగా కనిపించింది.
పంజాబ్ బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ జరుగుతున్నత సేపు ప్రీతీ జింటా ఉత్కంఠకు లోనయ్యారు. తక్కువ స్కోరుకే జట్టు అవుట్ కావడంపై కొంత నిరాశ చెందారు. ఓ దశలో మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకొన్నట్టే కనిపించారు. ఎప్పుడైతే పంజాబ్ బౌలర్లు విజృంభించారో.. అప్పటి నుంచి స్టేడియంలో ఎగురుతూ, కేరింతలు కొడుతూ ఆనందంలో మునిగి తేలారు. జట్టు వికెట్ సాధించినప్పుడల్లా, విజయానికి చేరువైన సమయంలో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
కోల్‌కతాపై పంజాబ్ జట్టు విజయం సాధించిన తర్వాత ప్రీతీ జింటా ముఖం 1000 వాల్ట్ బుగ్గలా వెలిగిపోయింది. విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరిని స్వయంగా కలుసుకొని మాట్లాడారు. ఇక 4 వికెట్లు తీసిన చాహల్‌ను గట్టిగా కౌగిలించుకొని అభినందించింది. చాహల్‌ను హగ్ చేసుకొన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రీతి జింటా ఉత్సాహంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మాత్రం ప్రోత్సాహం ఉంటే విజయాలు సాధించడం చాలా తేలిక అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











