CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో సంచలనం.. హ్యాట్రిక్‌తో పంజా విసిరిన పంజాబ్ బౌలర్!
సినీ తారల క్రికెట్ పండుగ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 ఘనంగా ప్రారంభమైంది. భారతీయ సినీ పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన సినీ రంగాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు జట్టుగా ఏర్పడి క్రికెట్ టోర్నీని గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. CCL 2026 టోర్నీలో మొత్తం 8 భాషలకు చెందిన సినీ పరిశ్రమ కళాకారులు పాల్గొంటారు. సీసీఎల్ ప్రీలిమినరీ రౌండ్ మ్యాచులను ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పోటీలు వైజాగ్‌లోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి అని నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లనే సంచలనం నమోదైంది. ఈ సంచలనం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
వైజాగ్‌లోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ గతేడాది ఛాంపియన్ పంజాబ్ దే షేర్ జట్టుతో రన్నరప్ కర్ణాటక బుల్డోజర్స్ జట్టు తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో కర్ణాటక జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ప్రదీప్, డార్లింగ్ కృష్ణ ఇన్నింగ్స్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. అయితే జట్టు స్కోర్ 31 పరుగులు ఉండగా డార్లింగ్ కృష్ణ దక్ష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాజీవ్ హను పరుగులేమి చేయకుండానే తర్వాత బంతికే పెవిలియన్‌కు వెను తిరిగాడు. దాంతో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

దక్ష్ హ్యాట్రిక్ తీసేందుకు సిద్దమయ్యారు. ప్రేక్షకులంతా ఆసక్తితో ఎదురు చూస్తుండగా.. ఆ తర్వాత బంతి వైడ్ కావడంతో స్కోర్ 32 పరుగులకు చేరింది. ఆ తర్వాత హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొనేందుకు వచ్చిన కెప్టెన్ సుదీప్ కిచ్చ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. దాంతో దక్ష్‌కు హ్యాట్రిక్ లభించింది. దాంతో 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత వెంటనే ప్రదీప్ కూడా అవుటవ్వడంతో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కర్ణాటక కష్టాల్లో పడింది. ధక్ష్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి బెస్ట్ బౌలర్ రేసులోకి వచ్చాడు.
తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ జట్టు బౌలర్లు సత్తా చాటారు. కానీ కర్ణాటక మిడిల్ ఆర్డర్ ధీటుగా బౌలర్లను ఎదుర్కొన్నది. కరణ్ ఆర్యన్ 33 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సత్తా చాటి నువ్వానేనా అంటూ మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. తొలి రోజే సంచలనాలు నమోదు చేసి ఈ టోర్నిపై ఆసక్తిని పెంచారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2011 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు వారియర్స్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2015, 2016, 2017, 2023 సంవత్సరంలో కప్ గెలుచుకొన్నది. ఈ టోర్నీలో అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెలుచుకోగా, ఆ తర్వాత చెన్నై రెండుసార్లు, కర్ణాటక రెండుసార్లు, బెంగాల్ ఒకసారి, ముంబై, పంజాబ్ చేరోసారి టైటిల్ గెలిచాయి. 2024 సంవత్సరంలో పటిష్టమైన కర్నాటక బుల్డోజర్స్ జట్టుపై బెంగాల్ టైగర్స్ జట్టు సంచలన విజయం సాధించింది. 2025 సంవత్సరంలో చెన్నై రైనోస్ జట్టుపై పంజాబ్ దే షేర్ జట్టు విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకొన్నది. ఈ ఏడాది ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











