Silk Smitha Birth Anniversary మేకప్ ఆర్టిస్టు నుంచి స్టార్‌గా.. సూసైడ్‌కు ముందు ఫోన్ కాల్ ఎవరికంటే?
దక్షిణాది సినీ పరిశ్రమలో శృంగారతారగా సినీ నటులనే కాకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. వెండితెరపై తన శృంగార నృత్యాలతో బాక్సాఫీస్ కలెక్షన్లకు చిరునామాగా నిలిచింది. స్టార్ హీరోలు తమ సినిమాల్లో సిల్క్ స్మిత ఉండేలా చేయడానికి వేచి ఉండేవారనేది సత్యం.
కడలి కెరటంలో సిల్క్ స్మిత ఎంత వేగంగా ఆకాశానికి ఎగిరిందో.. అంతే వేగంగా నేలను తాకింది. సిల్క్ స్మిత ప్రస్తుతం బతికి ఉంటే.. డిసెంబర్ 2వ తేదీన 62వ జన్మదినం జరుపుకొనేది. నూరేళ్లు జీవితాన్ని ఆస్వాదించాల్సిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడింది. స్కిల్క్ స్మిత జన్మదినం సందర్భంగా..

ఏపీలోని తెలుగు ఫ్యామిలీలో
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. ఆంధ్రప్రదేశ్‌లోని దెందూలురుకు సమీపంలోని కొవ్వలి గ్రామంలో రాములు, సరసమ్మ దంపతులకు జన్మించారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువుకు పుల్‌స్టాప్ పెట్టింది. తల్లిదండ్రుల బలవంతంతో 14 ఏటనే వివాహం చేసుకొన్నది. ఇష్టం లేని పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగానే మారింది. భర్త, అత్తారింటి వేధింపులతో దాంపత్య జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకొన్నది.

దర్శకుడు విను చక్రవర్తి పరిచయంతో
సిల్క్ స్మిత మేకప్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న వేషాలతో కెరీర్ ప్రారంభించింది. మద్రాసులోని ఏవీఎం స్టూడియోస్ వద్ద విజయలక్ష్మికి దర్శకుడు విను చక్రవర్తి పరిచయం కావడంతో ఆమె జాతకం మారిపోయింది. విజయలక్ష్మీ పేరును స్మితగా మార్చింది దర్శకుడు విను చక్రవర్తి అని సినీ వర్గాలు చెప్పుకొంటారు. స్మితకు డ్యాన్స్, యాక్టింగ్, ఇతర అంశాలను విను చక్రవర్తి భార్య కర్నా నేర్పించింది.

స్కిల్ స్మితగా ఎలా మారిందంటే?
తమిళ చిత్రం వందిచక్రమ్ సినిమాతో స్మిత జీవితం అనూహ్యంగా మారిపోయింది. ఆ సినిమాలో సిల్క్ అనే పాత్రలో బార్ గర్ల్‌గా నటించింది. ఆ సినిమా భారీ విజయం అందుకోవడం, సిల్క్ పాత్రకు పేరు రావడంతో స్మిత పేరు.. సిల్క్ స్మితగా మారిపోయింది. అప్పటి నుంచి కెరీర్ పరంగా స్మిత వెనక్కి చూసుకొన్న దాఖలాలు లేవని సినీ వర్గాలు చెబుతాయి.

17 ఏళ్లలో 450 చిత్రాల్లో..
సిల్మ్ స్మిత తన 17 సినీ జీవితంలో ఐదు భాషల్లో నటించింది. శృంగారతారగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె కెరీర్ ఎదురులేకుండా సాగిపోయింది. దాదాపు 450కిపైగా చిత్రాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, కృష్ణ లాంటి అగ్ర నటులు, సౌత్‌లో అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించి మెప్పించింది.

35 ఏళ్ల వయసులో బలవన్మరణం
సిల్మ్ స్మిత జీవితం సాఫీగా సాగిపోతుందనుకొనే సమయంలో 1996 సెప్టెంబర్ 23 తేదీన అంటే తన 35వ ఏట చెన్నైలోని తన ఫ్లాట్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకొన్నది. ఆర్థిక సమస్యలు, అఫైర్లు బ్రేకప్స్‌తో మనస్తాపం చెందిన ఆమె ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నట్టు కథనాలు వచ్చాయి. అయితే ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

చివరి ఫోన్ కాల్ ఎవరికంటే?
సిల్క్ స్మిత తన మరణానికి కొన్ని గంటల ముందు కన్నడ నటుడు రవిచంద్రన్‌తో మాట్లాడాలని ప్రయత్నించింది. స్వయంగా ఈ విషయాన్ని రవిచంద్రన్ వెల్లడించారు. సెప్టెంబర్ 23వ తేదీన సిల్క్ స్మిత ఫోన్‌లో నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ ఫోన్ కాల్ కనెక్టవిటీ సరిగా లేని కారణంగా మాట్లాడలేకపోయాను. షూటింగులో బిజీగా ఉండటం కారణంగా నేను మళ్లీ కాల్ బ్యాక్ చేయలేకపోయాను.
రొటీన్ కాల్ అనుకొన్నాను. కానీ మరుసటి రోజు ఆమె సూసైడ్ చేసుకొన్నారనే వార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. చివరిసారిగా తను ఏం మాట్లాడాలని అనుకొన్నారో.. నేను మాట్లాడి ఉంటే బాగుండేదనే బాధ నన్ను ఇప్పటికి వెంటాడుతూనే ఉంది అని రవిచంద్రన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











