HBD Sridevi: ఎన్టీఆర్‌తో శ్రీదేవి వరల్డ్ రికార్డు.. బాలయ్య అన్ లక్కీ.. ఆమె గురించి ఈ నిజాలు తెలుసా?
అతిలోక సుందరి అన్న పదానికి సరైన అర్థాన్ని చెప్పేలా అందంతో మాయ చేసి.. దాదాపు నలభై ఏళ్ల పాటు సినీ ఆకాశంలో ధృవతారలా వెలుగొందిన నటి శ్రీదేవి. ఎన్నో కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆమె.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన ప్రభావాన్ని చూపించారు. తద్వారా దేశమే గర్వించదగ్గ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇండియన్ సినిమాపై అంతటి మార్కును చూపించిన శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో, సినీ ప్రయాణంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటన గురించి తెలుసుకుందాం పదండి!
చిన్నప్పుడే మొదలైన కెరీర్: 1963లో శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. 1967లో అంటే నాలుగేళ్ల వయసులోనే 'కంధన్ కరుణై' అనే తమిళ చిత్రంలో బాలనటిగా నటించారు. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో పని చేశారు. ఈ క్రమంలోనే 'బడి పంతులు' సినిమాలో ఎన్టీఆర్ మనవరాలి పాత్రను పోషించారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటారు.

ఆ చిత్రంతో హీరోయిన్‌గానూ: బాలచందర్ దర్శకత్వంలో 1976లో వచ్చిన 'మూండ్రూ మూడిచ్చు' అనే తమిళ చిత్రంతో శ్రీదేవి హీరోయిన్‌గా మారారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత ఈమె రజినీకాంత్, కమల్ హాసన్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మిగిలిన భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన సత్తాను నిరూపించుకున్నారు. దీంతో శ్రీదేవి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.
తెలుగులోకి వచ్చి వాళ్లతోనే: తమిళంలో సత్తా చాటిన శ్రీదేవి 1977లో వచ్చిన 'బంగారక్క' మూవీతో తెలుగులోకి పరిచయం అయ్యారు. దీని తర్వాత చేసిన 'పదహారేళ్ల వయసు'తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఏకంగా స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో మనవరాలిగా, హీరోయిన్‌గా చేసి వరల్డ్ రికార్డు కొట్టారు.

ఆ స్టార్లతోనూ.. బాలయ్యతో: మొదటి తరం హీరోతో ఆడిపాడిన శ్రీదేవి.. ఆ తర్వాత స్టార్లు చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌తోనూ పలు చిత్రాల్లో నటించారు. అప్పటి హీరోల్లో నందమూరి బాలకృష్ణతో మాత్రమే ఆమె నటించలేదు. అయితే, 'సింహం నవ్వింది' అనే సినిమాలో ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా చేయగా.. బాలయ్య అందులో కీలక పాత్ర చేశాడు. దీని తర్వాత వీళ్ల కాంబో అనుకున్నా వర్కౌట్ కాలేదు.
అవార్డ్స్, ఘనతలు, రికార్డ్స్: తన సినీ ప్రయాణంలో శ్రీదేవి ఎన్నో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. బాలనటిగానే ఉత్తమ నటనతో పలు అవార్డులు గెలుచుకున్న ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ ఫిల్మ్‌ఫేర్, నంది సహా పలు అవార్డులు దక్కాయి. అలాగే, ప్రభుత్వం తరపున పలు పురస్కారాలు కూడా వచ్చాయి. అంతేకాదు, తన సినీ కెరీర్‌లో శ్రీదేవి ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసి సత్తా చాటారు.

ప్రేమ పెళ్లి... ఇద్దరు పిల్లలు: దక్షిణాదిలోని సత్తా చాటిన శ్రీదేవి.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం వెళ్లారు. అక్కడ కూడా స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్‌ను ఆమె పెళ్లాడారు. అయితే, అంతకు ముందే ఆయనకు భార్య ఉండగా.. ఆమెను వదిలేసి శ్రీదేవిని చేసుకున్నారు. ఇక, వీళ్లకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టిన విషయం తెలిసిందే.

సినిమాలు చేస్తుండగానే: దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినిమాల్లో సత్తా చాటిన శ్రీదేవి.. పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు దాదాపుగా దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరోయిన్ 2012లో వచ్చి విజయవంతమైన కామెడీ డ్రామా 'ఇంగ్లీష్ వింగ్లిష్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తన 300వ చిత్రం మామ్‌లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా మళ్లీ కెరీర్ సాగుతోన్న సమయంలోనే అంటే 2018లో కన్నుమూశారు. ఇక, శ్రీదేవి 60వ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటోంది ఫిల్మీబీట్ టీమ్.


Click it and Unblock the Notifications











