Women's Day 2025: దీపికలో ఉత్తమ నటిగా పరిచయం చేసిన మూవీ ఏంటో తెలుసా?
నటీనటుల జీవితంలో మైలురాళ్లు, చెప్పుకోదగ్గ పాత్రలు ఏదో ఒకటి రెండు సార్లే వస్తాయి. కానీ అవి జీవితం మొత్తానికి సరిపోయే పేరుతో పాటు చలన చిత్ర చరిత్రలోనే మిగిలిపోతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు దీపికా పదుకొనె. గ్లామర్ రోల్స్, అందాల ఆరబోతతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన ఈ ముద్దుగుమ్మలోని నటిని బయటికి తీసుకొచ్చిన సినిమా ఛపాక్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా గురించి చూస్తే:
దిగ్గజ బ్యాట్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనె కుమార్తె దీపికా పదుకొనె. 2006లో కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య అనే సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టిన దీపిక ఆ తర్వాత తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్ పైనే పెట్టారు. ఓం శాంతి ఓం, లవ్ ఆజ్ కాల్, హౌస్‌ఫుల్, డమ్ మారో దమ్, కాక్‌టెయిల్, రేస్, దేశీ బాయ్స్, బాంబే టాకీస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూఇయర్, పీకూ, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, జీరో, బ్రహ్మస్త్ర పార్ట్ 1, పఠాన్, జవాన్, ఫైటర్ , సింగమ్ ఎగైన్ , కల్కి 2898 ఏడీ చిత్రాలతో బాలీవుడ్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని పొజిషిన్‌కు చేరుకున్నారు దీపిక.

సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాల ద్వారా దీపిక ప్రతి యేటా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్న దాని ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పై మాటే. గతేడాది గర్భం దాల్చిన దీపిక పదుకొనె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. గర్భంతో ఉండే పలు చిత్రాలు, వాటి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భర్త, కుమార్తెతో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు దీపిక.
ఇక ఆమె కెరీర్‌లో పద్మావత్ మూవీ ఓ మైలురాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీపిక మంచి ఊపులో ఉన్నారు. దీంతో ఆమె తదుపరి ఏ సినిమా చేస్తారా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ సినిమా తర్వాత జీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన ఆమె ఛపాక్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. చిన్నతనంలోనే యాసిడ్ దాడికి గురై, ధైర్యంగా జీవితాన్ని కొనసాగిస్తోన్న లక్ష్మీ అగర్వాల్ అనే యోధురాలి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్ చిత్రం దీపికలోని నటిని, మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ ముఖానికి పలు సర్జరీలు జరిగాయి. తన అందమైన రూపం కోల్పోయినా, అవమానాలు ఎదురైనా లక్ష్మీ మొక్కవోని ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితాన్ని గెలిచారు. తన లాంటి కష్టం ఏ అమ్మాయికి రాకూడదనే ఉద్దేశంతో యాసిడ్ అమ్మకాలపై పోరాటం చేశారు. ఆమె ధైర్యానికి , సాహసానికి అమెరికా ప్రభుత్వం సైతం కరిగిపోయింది. నాటి అగ్రరాజ్యాధినేత బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును అందుకున్నారు. ఈ యోధురాలి పాత్రలోనే దీపిక నటించి తెరపై లక్ష్మీ అగర్వాల్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు.
లక్ష్మీకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న వెంటనే తాను భావోద్వేగానికి గురయ్యానని, ఇలాంటి యోధురాలి పాత్రలో నటించే అదృష్టం తనకు దక్కిందని, ఆమె కథ అందరికీ తెలియాలని, ఈ సినిమాకు నిర్మాతగాను వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఛపాక్ 10 జనవరి 2020న విడుదలైంది. ఈ చిత్రం మర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు దీపికకు మంచి పేరు తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











