Celebrity Cricket League 2023 విజేత తెలుగు వారియర్స్.. భోజ్‌పురి జట్టుపై అఖిల్ సేన ఘన విజయం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 ఛాంపియన్‌షిప్‌ను తెలుగు వారియర్స్ గెలుచుకొన్నది. వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు అలవోకగా టైటిల్‌ను సొంతం చేసుకొన్నది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

టాస్ గెలిచిన తెలుగు వారియర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టోర్నీలో అద్బుతమైన ప్రతిభను చాటి వరుసు విజయాలు చేజిక్కించుకొన్న తెలుగు వారియర్స్ జట్టు, భోజ్‌పురి దబాంగ్స్ జట్టు టైటిల్ పోరు బరిలోకి ఉత్సాహంగా దూకాయి. వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అఖిల్ అక్కినేని టాస్ గెలిచి ఫీల్గింగ్ ఎంచుకొన్నాడు. భోజ్‌పురి దబాంగ్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.

తొలి ఇన్సింగ్స్‌లో భోజ్‌పురి
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు భోజ్‌పురి దబంగ్స్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ మనోజ్ తివారీ 9 పరుగులు, ప్రవేశ్ యాదవ్ 4 పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఉదయ్ తివారీ 10 పరుగులు, అస్గర్ ఖాన్ 26, అన్షుమన్ సింగ్ 11 పరుగులు, విక్రాంత్ సింగ్ 9 పరుగులు చేశాడు.

తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్‌లో
తెలుగు వారియర్స్ జట్టులో రఘు 2 ఓవర్లు వేసి 10 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకొన్నాడు ప్రిన్స్ 12 పరుగులు ఇచ్చి ఒక వికెట్, టెలివిజన్ నటుడు నందకిషోర్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం గమనార్హం. కడపటి వార్తలు అందేసరికి.. 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి తెలుగు వారియర్స్ జట్టు 49 పరుగులు చేసింది. అఖిల్ 36 పరుగులతో, రఘు 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

భోజ్‌పురి రెండో ఇన్సింగ్స్‌లో
భోజ్‌పురి దబాంగ్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించింది. నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. భోజ్‌పురి జట్టులో ఆదిత్య ఓజా 31 పరుగులు, ప్రవేశ్ యాదవ్ 1, అస్గరీ ఖాన్ 6 పరుగులు, ఉదయ్ తివారీ 34 పరుగులు, మనోజ్ తివారీ 14 పరుగులు, దినేష్ యాదవ్ 1 పరుగు చేశారు. తెలుగు వారియర్స్ జట్టులోని బౌలర్లలో సామ్రాట్ 2 వికెట్లు, అశ్విన్ బాబు 1 వికెట్, తమన్ 2 వికెట్లు, ప్రిన్స్ 1 వికెట్ తీశారు.

తెలుగు వారియర్ విజయం
ఇక తెలుగు వారియర్స్ జట్టు 58 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తమన్, అశ్విన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తమన్ 10 పరుగులు చేసి ఆరంభంలోనే అవుటయ్యారు ఆ తర్వాత సచిన్ జోషితో కలిసి అశ్విన్ బాబు బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. చివరి వరకు క్రీజులో ఉండి ఇంకా 24 బంతులు ఉండగానే విజయ లక్ష్యాన్ని చేరుకొన్నారు. అశ్విన్ బాబు 31 పరుగులు, సచిన్ జోషి 14 పరుగులు చేశారు. భోజ్‌పురి జట్టులో విక్రాంత్ సింగ్ ఒక్కరు ఒక వికెట్ తీసుకొన్నారు.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అఖిల్ అక్కినేని
తెలుగు వారియర్ గెలుపు సాధించగానే ఆటగాళ్లందరూ ఉత్సాహంలో మునిగిపోయారు. సీనియర్లు వెంకటేష్, శ్రీకాంత్తో సహా పరుగులు పెట్టారు. గ్రౌండ్ అంతా తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం జరిగిన అవార్డుల ప్రధానంలో బెస్ట్ బౌలర్ అవార్డు థమన్,
బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది మ్యాచ్ ఆదిత్య ఓజా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అఖిల్ అక్కినేని అందుకొన్నారు. బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రిన్స్ నిలిచాడు.

ట్రోఫి అందుకొన్న అఖిల్ అక్కినేని
సీసీఎల్ 2023 విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్‌కు ట్రోఫిని అందజేశారు. టీమ్ తరఫున అఖిల్ అక్కినేని ట్రోఫిని అందుకొన్నారు. సీసీఎల్ అధినేత విష్ణు ఇందూరి చేతుల మీదుగా వెంకటేష్ సమక్షంలో అఖిల్ ట్రోఫిని అందుకొన్నారు. అనంతరం టీమ్ సభ్యులందరూ కేరింతలు కొడుతూ ట్రోఫిని ముద్దాడారు. ఆ తర్వాత జట్టు సభ్యులందరూ కలిసి ఫోటోకు ఫోజిచ్చారు.


Click it and Unblock the Notifications











