Year Ender 2023: తెలుగులో రికార్డు క్రియేట్ చేసిన హీరోయిన్.. ఒక్క ఏడాదే నాలుగు హిట్లు.. ఎవరో తెలుసా?
ప్రతి సంవత్సరంలో టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు సందడి చేస్తుంటారు. అందులో కొందరు స్టార్ హీరోయిన్లు అయితే ఒకటి రెండు చిత్రాలతో వచ్చి తమదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంటారు. అలాగే, 2023వ ఏడాదిలో కూడా వందకు పైగా వచ్చిన సినిమాల్లో పదుల సంఖ్యలో హీరోయిన్లు వచ్చి ఆకట్టుకున్నారు. అయితే, అందులో ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే నాలుగు సినిమాలతో వచ్చింది. అవన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. ఇంతకీ ఆ భామ ఎవరో మీరే చెప్పండి మరి!
2023వ సంవత్సరంలో ఎక్కువ సినిమాలలో కనిపించిన హీరోయినే శృతి హాసన్. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ అమ్మడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో నటసింహా బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన 'వీర సింహా రెడ్డి' ఒకటి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 80 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది.

'వీర సింహా రెడ్డి' మూవీ వచ్చిన తర్వాతి రోజే శృతి హాసన్ నటించిన మరో చిత్రం కూడా విడుదలైంది. అదే మెగాస్టార్ చిరంజీవి - కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ. 137.85 కోట్లు రాబట్టింది. తద్వారా ఏకంగా రూ. 48.85 కోట్ల లాభాలను అందుకుంది. తద్వారా చిరు కెరీర్‌లోనూ ఈ ఏడాదిలోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.

2023లో శృతి హాసన్ మరో సినిమాలోనూ నటించింది. అదే నేచురల్ స్టార్ నాని - శౌర్యూవ్ కాంబినేషన్‌లో రూపొందిన 'హాయ్ నాన్న'. ఇందులో శృతి హాసన్ కనిపించింది కేవలం ఒకటి రెండు సన్నివేశాలతో పాటు ఓ పాటలో మాత్రమే. ఇక, ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా శృతి హాసన్ ఖాతాలో ఈ ఏడాది మరో విజయం కూడా వచ్చి చేరింది.

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటించిన ఇంకో సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా షేర్‌తో పాటు రూ. 450 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసి విజయం దిశగా సాగిపోతోంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారాంతానికి ఈ చిత్రం టార్గెట్‌ను చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇలా శృతి హాసన్ 2023లో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నాలుగూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఫలితంగా ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఫలితంగా ఈ అమ్మడి పేరు టాలీవుడ్‌లో ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది.


Click it and Unblock the Notifications











