2021 Telugu Remake Movies: ఈ ఏడాది హిట్ కొట్టింది అలాంటి సినిమాలే.. ఆ స్టార్ హీరో గొప్ప రికార్డు
కరోనా మహమ్మారి ప్రభావంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి 2020వ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడం.. సినిమాలు ఆగిపోవడం వంటి వాటి వల్ల చాలా తక్కువ చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, 2021లో ఇలాంటి పరిస్థితే ఉన్నా.. కాస్త ఎక్కువ సినిమాలే విడుదలయ్యాయి. అందులో కొన్ని మూవీలు మాత్రమే విజయాలను అందుకున్నాయి. అందులో ఎక్కువ శాతం మాత్రం రీమేక్ అయిన చిత్రాలే ఉన్నాయి. ఈ ఏడాది చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో 2021లో తెలుగులోకి రీమేక్ అయి.. సూపర్ హిట్ అయిన సినిమా గురించి తెలుసుకుందాం పదండి. ఇందులో ఓ స్టార్ హీరో రికార్డును కూడా అందుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

వకీల్ సాబ్ మూవీ అలా వచ్చింది
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా రూపొంది.. సూపర్ డూపర్ హిట్ అయింది.

తమిళ సినిమాతో రామ్ విజయం
కిశోర్ తిరుమల దర్శకత్వలో రామ్ పోతినేని నటించిన చిత్రమే 'రెడ్'. స్రవంతి రవి కిశోర్ నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. దీనికి మణి శర్మ సంగీతం అందించాడు. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇది తమిళ చిత్రం 'తడమ్'కు రీమేక్‌గా వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ విజయాన్ని అందుకుంది.

బాలీవుడ్ మూవీతో నితిన్ సక్సెస్
ఈ ఏడాది వరుస ఫ్లాపుల తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన మూడో చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అంధాధున్'కు రీమేక్‌గా వస్తున్న దీనిని మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. ఇందులో తమన్నా భాటియా కీలక పాత్రను చేయగా.. నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలై భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.

టాలీవుడ్‌లో ఆ స్టార్ హీరో రికార్డు
2021లో విడుదలైన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ చేసినవే రెండు ఉన్నాయి. అందులో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'నారప్ప' తమిళ మూవీ అసురన్‌కు రీమేక్‌గా వచ్చింది. అలాగే, ఇటీవల వచ్చిన 'దృశ్యం 2' కూడా రీమేక్‌గానే తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలూ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అలాగే, ఈ రెండింటికి భారీ స్పందన రావడంతో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

చిన్నగా వచ్చినా సక్సెస్‌ఫుల్‌గానే
ఈ సంవత్సరం భారీ చిత్రాలతో పాటు చిన్న చిన్న రీమేక్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. అందులో సత్యదేవ్ హీరోగా నటించిన 'తిమ్మరుసు' ఒకటి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఇది 'న్యూ ట్రయల్' అనే కొరియన్ చిత్రానికి రీమేక్‌గా వచ్చింది. అలాగే, సుమంత్ 'కపటధారి' కూడా ఇదే జోనర్‌లో వచ్చింది. ఈ మూవీ 'కవలుధారి' అనే కన్నడ మూవీకి రీమేక్‌గా వచ్చింది.

ఆకట్టుకున్న మరికొన్ని రీమేక్‌లు
2021వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న రీమేక్ చిత్రాల్లో 'డియర్ మేఘ' ఒకటి. మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం 'దియా' అనే కన్నడ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. అలాగే, తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ కాంబోలో వచ్చిన 'ఇష్క్' అదే పేరుతో మలయాళంలో వచ్చిన చిత్రానికి రీమేక్‌గా రూపొంది మంచి టాక్ అందుకుంది.


Click it and Unblock the Notifications











