ఎట్టకేలకు చైనాలో విడుదలైన 2.0... బాక్సాఫీస్ వసూళ్లపైనే అందరి ఫోకస్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 మూవీ గతేడాది ఇండియాలో రిలీజైంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ దాదాపు రూ. 570 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.
ఇండియన్ సినిమాలకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన తరుణంలో... ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయడం ద్వారా ఏర్పడిన నష్టంలో ఎంతో కొంత పూడ్చుకోవాలని భావించారు. ఇప్పటికే అక్కడ సినిమా విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 6)న చైనాలో విడుదలైంది.

చైనా వ్యాప్తంగా 2.0 మూవీ దాదాపు 48,000 స్క్రీన్లలో విడుదలైనట్లు తెలుస్తోంది. ఇది 3డి మూవీ కావడంతో ఎక్కువగా అలాంటి స్క్రీన్లలోనే రిలీజ్ చేసినట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం చైనా మార్కెట్లో ఈ మూవీ సమ్మర్లో విడుదలై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇపుడు ఈచిత్రం అక్కడ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.
చైనా మార్కెట్లో గతంలో అమీర్ కాన్ మూవీ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ మంచి విజయం అందుకున్నాయి. 2.0 మూవీ చైనీయులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చర్చనీయాంశం అయింది. గతేడాది నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రం ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్ కలిపి దాదాపు రూ. 800 కోట్లు వసూలు చేసినట్లు అంచనా.


Click it and Unblock the Notifications











