జన నాయగన్ లీక్ కేసులో ముగ్గురు అరెస్ట్.. పైరసీ చూస్తే కఠిన శిక్ష.. సైబర్ వార్నింగ్
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురవ్వడం సంచలనం రేపింది. ఈ చిత్రాన్ని పైరసీ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై లీక్ చేయడం భారతీయ సినిమా రంగాన్ని షేక్ చేసింది. దాదాపు 500 కోట్ల రూపాయలు థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమాను ఏకంగా లీక్ చేయడంతో సినీ వర్గాలు దిగ్బ్రాంతికి గురయ్యాయి. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఈ వ్యవహారం వణుకుపుట్టేలా చేసింది. అయితే ఈ కేసులో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించడమే కాకుండా నిందితులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
వాస్తవానికి జన నాయగన్ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సింది. సెన్సార్ సర్టిఫికెట్ లభించకపోవడం వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు, డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దాంతో చిత్ర యూనిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ సినిమా సెన్సార్ వ్యవహారం స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం చెప్పడంతో కేసు మళ్లీ చెన్నైకి షిఫ్టు అయింది. ఆ తర్వాత రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ లోపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. విజయ్ సొంత పార్టీని ఏర్పాటు చేసి రాజకీయంగా కీలకంగా మారడంతో సినిమా రిలీజ్‌కు మరో అడ్డంకి ఏర్పడింది. ఇలాంటి వివాదాల మధ్య జన నాయగన్ సినిమాను పైరసీ రక్కసి లీక్ చేయడం అత్యంత వివాదంగా మారింది. ఈ లీక్ నేపథ్యంలో ఈ కేసును చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ టేకప్ చేసింది. తాజా ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈ క్రమంలో చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
జన నాయగన్ సినిమా లీక్ వ్యవహారంలో టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత.. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 15వ తేదీన ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. జననాయగన్ సినిమాను పైరసీ చేసి లీక్ చేశారని ధృవీకరించుకొన్నాం. వారిని కోర్టులో హాజరుపరిచాం. ఆ తర్వాత జుడిషియల్ కస్టడీకి రిమాండ్‌పై తరలించాం. అందులో ఒకరు ఫ్రీలాన్స్ ఎడిటర్ ఉన్నారు అని వారు లేఖలో తెలిపారు.
జన నాయగన్ సినిమా లీక్ కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే.. ఈ సినిమాను డౌన్‌లోడ్ చేయడం గానీ, స్ట్రీమ్ చేయడం గానీ, పైరసీ కంటెంట్‌ను షేర్ చేయడం లాంటివి చేయవద్దు అని వారు తెలిపారు. ఎవరైనా పైరసీకి పాల్పడుతున్నారనే విషయం తెలిస్తే.. వాటికి సంబంధించిన వివరాలు, లింకులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు అందించాలి. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 1930 వివరాలు అందించాలి అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications