హీరోయిన్ సంగీత పై హత్యాబెదిరింపు కేసు
చెన్నై: చెన్నైకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు సంగీత-క్రిష్ దంపతులపై కోర్టు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వలసరవాక్కం పోలీసులు సంగీత, ఆమె భర్త క్రిష్, భాస్కరన్, ఆమె భార్య కలైలపై బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా మాట్లాడటం. అనాగరికంగా నడుచుకోవటం, హత్యాబెదిరింపు తదితర కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే... చెన్నై వలసరవాక్కం జానకీనగర్‌లోని నటరాజన్ నివాసంలో ఉషా శంకర్‌నారాయణన్(60) అనే అవివాహితుడు అద్దెకుంటున్నాడు. శునకాల ప్రేమికుడైన శంకర్‌నారాయణన్ నాలుగు వీధి కుక్కలను పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ఎదురింటిలో భాస్కరన్ అనే వ్యక్తి మేలుజాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు.

అయితే శంకర్‌నారాయణన్ కుక్కలు భాస్కరన్ కుక్కను చూసి మొరుగుతున్నాయంటూ ఇద్దరి మధ్య తరుచుగా వివాదం చోటుచేసుకుంటూ వచ్చింది. అదే సమయంలో భాస్కరన్ పక్క నివాసంలో ఉంటున్న సినీ నటి సంగీత, ఆమె భర్త క్రిష్‌లు భాస్కరన్‌కు మద్దతుగా మాట్లాడటమే కాకుండా.. ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయాలని, లేదంటే హత్య చేస్తామని బెదిరించినట్లు, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ.. శంకర్‌నారాయణ్ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే శంకర్‌నారాయణన్ వ్యాఖ్యలను నటి సంగీత ఖండించింది. ఆమె మాట్లాడుతూ.. నిజానికి అతని కుక్కలే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, దీనిపై నిలదీసిన పాపానికి కుక్కలను తనపైకి ఉసిగొల్పాడని ఆరోపించింది. దీనిపై తాను ఇప్పటికే పోలీసులకు, చెన్నై కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సంగీత పేర్కొంది.


Click it and Unblock the Notifications











